పరదాల మహారాణి కొంచెం జాగ్రత్తగా ఉండాలి: పవన్ కల్యాణ్

  • తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో వారాహి విజయభేరి సభ
  • పవన్ కల్యాణ్ వాడీవేడి ప్రసంగం
  • రాష్ట్రాన్ని ఓ మహారాణి ఏలుతోందని వ్యాఖ్యలు
  • పరదాల మహారాణి వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడి
జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సభకు రాజమండ్రి లోక్ సభ స్థానం బీజేపీ అభ్యర్థి పురందేశ్వరి కూడా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా పవన్ ప్రసంగిస్తూ... కాకినాడ ఆదిత్య కాలేజీ విద్యార్థులు పరదాల మహారాణిని ఇబ్బంది పెట్టారంట అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మన రాష్ట్రాన్ని ఏలే మహారాణి కొంచెం జాగ్రత్తగా ఉండాలి... విద్యార్థులు కక్ష పెంచేసుకుంటారు... ఆ మహారాణి వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమైంది... కొత్త తరానికి భవిష్యత్ ఇచ్చేందుకు దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తోంది అని పవన్ పేర్కొన్నారు. 

"రాజమండ్రి పార్లమెంటు స్థానానికి దగ్గుబాటి పురందేశ్వరి గారు పోటీ చేస్తున్నారు... వారికి నా శుభాకాంక్షలు. అలాగే, గాజుగ్లాసు గుర్తుపై రాజానగరం అసెంబ్లీ స్థానం జనసేన అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. వారికి నా శుభాకాంక్షలు. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు కేఎస్ జవహర్ గారికి, రాజానగరం టీడీపీ ఇన్చార్జి వెంకటరమణ చౌదరి గారికి నా నమస్కారాలు.

ఇక్కడ జక్కంపూడి రాజా గారి పాలన మీకు నచ్చిందా? ఒకసారి ఆయన గురించి మాట్లాడే ముందు సమస్య ఏంటో చెబుతాను. చాలామంది వైసీపీ నేతల్లో నా అభిమానులు ఉన్నారు. వారు సినిమా పరంగా నేనంటే ఇష్టపడతారు. ఎంతగా నన్ను అభిమానించే వాళ్లే అయినా... దేశానికి, సమాజానికి విఘాతం కలిగిస్తూ, ప్రకృతి వనరులను దోచేస్తూ, స్కాంలు చేస్తూ ఉంటే వారిని వ్యక్తిగతంగా అభిమానిస్తానేమో కానీ, రాజకీయంగా మాత్రం వారితో నేను విభేదిస్తాను. 

జక్కంపూడి రాజా గారిది పెద్ద కుటుంబం. జక్కంపూడి రామ్మోహనరావు గారిని నేను ఎంతో అభిమానిస్తాను. వారి కుటుంబంపై నాకు గౌరవం ఉంది. కానీ దురదృష్టవశాత్తు రాజానగరం స్కాంలకు, గంజాయికి, ఇసుక దోపిడీకి రాజధాని అయింది. ఒకప్పుడు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో బ్లేడు బ్యాచ్ గురించి విన్నాను. సరైన పాలకుడ్ని ఎన్నుకోకపోవడం వల్ల ఆ హింసాత్మకమైన సంస్కృతి ఇవాళ పచ్చని తూర్పు గోదావరి జిల్లాలోకి కూడా వచ్చేసింది. దీనికి ఒకటే మందు... ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడం... వైసీపీ గూండాల తాట తీయడమే దీనికి మందు. 

కొన్ని నియోజకవర్గాల్లో జనసేన నెంబర్ వన్ స్థానంలో ఉండి కూడా... ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలుసుకుని, ఆ మేరకు పొత్తు కుదుర్చుకుని సీట్ల సర్దుబాటు చేసుకున్నాం. పొత్తు ఎందుకంటే... మరోసారి వైసీపీ ప్రభుత్వాన్ని భరించలేం. వైసీపీ పాలన ఇంకొక్కసారి వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. 

జగన్ ఈ మధ్య నన్ను ఎక్కువ తిట్టేస్తున్నాడు... పాపం! నన్ను తిడుతుంటే నాకు చాలా కోపం వచ్చేస్తుందని జగన్ అనుకుంటున్నాడు. నన్ను ఏమి తిట్టినా నాకు కోపం రాదు. కానీ ప్రజల మీద ఒక్క ఈగ వాలితే నాకు ఆపాదమస్తకం కోపం వస్తుంది. మీరు బూతులు తిట్టినా నాకు కోపం రాదు కానీ, ఒక దళిత డ్రైవర్ ను అకారణంగా, అన్యాయంగా చంపి డోర్ డెలివరీ చేయగానే నాకు వచ్చిన కోపం అంతా ఇంతా కాదు" అంటూ పవన్ ధ్వజమెత్తారు.


More Telugu News