బీఆర్ఎస్ అందుకే చిత్తుగా ఓడిపోయింది: ఈటల రాజేందర్

  • ప్రధాని మోదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న ఈటల
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని విమర్శ
  • రాహుల్ గాంధీ ప్రధాని అవుతారనేది పగటి కలే అన్న ఈటల రాజేందర్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన అహంకారంతో సహచర మంత్రులను, నాయకులను, ప్రజలను మరిచిపోయారని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారని మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. శనివారం ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ... ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలన్నారు. బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే నష్టమే తప్ప లాభం లేదన్నారు. బీఆర్ఎస్‌తో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని విమర్శించారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.

డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత రైతులను మోసం చేశారని ఆరోపించారు. సీఎం రేవేంత్ రెడ్డికి రుణమాఫీ చేసే దమ్ము లేదని ఎద్దేవా చేశారు. కల్యాణ లక్ష్మి, తులం బంగారం ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణలో 17 లోక్ సభ సీట్లు కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని... కానీ అది పగటి కలే అవుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై పెట్టిన దృష్టి పాలనపై పెట్టడం లేదని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు రాష్ట్రంలో అమలు కాకుండా అడ్డుకున్నది కేసీఆరేనని ఆరోపించారు. యావత్ దేశం 500 ఏళ్లుగా ఎదురు చూసిన అయోధ్య రామాలయాన్ని కేవలం రెండేళ్లలో నిర్మించిన ఘనత ప్రధాని మోదీదే అన్నారు. ప్రపంచ దేశాలలో భారత కీర్తిప్రతిష్టలను పెంచిన వ్యక్తి నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ అంటే స్కామ్‌లు... బీజేపీ అంటే అభివృద్ధికి బాటలు అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అద్భుత విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


More Telugu News