తొలి విడత పోలింగ్ లోనే బీజేపీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది: తేజస్వి యాదవ్

  • 400కు పైగా స్థానాలు అంటూ మోదీ, బీజేపీ ప్రచారం
  • బీహార్ లో తమకు పోటీనే లేదన్న తేజస్వి
  • ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కలిసి పోటీ చేస్తున్నాయని వ్యాఖ్య
ఈ సారి 400కి పైగా స్థానాలు అంటూ ప్రధాని మోదీ, బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. '400కు మించి' అనే బీజేపీ సినిమా తొలి విడత పోలింగ్ లోనే అట్టర్ ఫ్లాప్ అయిందని ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఎద్దేవా చేశారు. బీహార్ ప్రజలకు అన్నీ తెలుసని.. బీజేపీకి రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెపుతారని అన్నారు. బీహార్ లో జరిగిన తొలి విడత ఎన్నికల్లో తమకు పోటీనే లేదని చెప్పారు. బీహార్ ప్రజలు షాకింగ్ ఫలితాలను ఇవ్వబోతున్నారని అన్నారు. బీహార్ ప్రజలకు వాళ్లు చేసిందేమీ లేదని... 2014, 2019 ఎన్నికల్లో మోదీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. వాళ్ల తప్పుడు హామీలతో బీహార్ ప్రజలు విసిగిపోయారని అన్నారు. 

ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కలసికట్టుగా పని చేస్తున్నాయని తేజస్వి తెలిపారు. బీహార్ లో అన్నింటికన్నా పెద్ద సమస్య నిరుద్యోగమని చెప్పారు. దీంతో పాటు పేదరికం, ఆకాశాన్నంటుతున్న ధరలు, వలసలు, వరదలు తదితర సమస్యలు ఉన్నాయని అన్నారు. మరోవైపు తొలి విడతలో బీహార్ లో నాలుగు లోక్ సభ స్థానాల్లో (ఔరంగాబాద్, గయ, నవడ, జముయి) ఎన్నికలు జరిగాయి. 48.88 శాతం ఓటింగ్ నమోదయింది.


More Telugu News