చంద్రబాబును కలిసిన తర్వాత పవన్ ఎన్ని ఆస్తులు కొన్నారో చెప్పాలి: పోతిన మహేశ్

  • విశాఖ మినహా జనసేన ఎక్కడా కనిపించలేదన్న పోతిన
  • చంద్రబాబు దగ్గర పవన్ ఎంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పాలని డిమాండ్
  • బ్లాక్ మనీని 'హరిహర వీరమల్లు' సినిమాపై పెడుతున్నారని ఆరోపణ
జనసేన పార్టీని ఎందుకు పెట్టారో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చెప్పాలని వైసీపీ నేత పోతిన మహేశ్ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పల్లకీని మోయడమే పవన్ కల్యాణ్ ఏకైక అజెండా అని విమర్శించారు. విశాఖ మినహా మరెక్కడా జనసేన కనిపించడం లేదని అన్నారు. చంద్రబాబు దగ్గర పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకున్నారని చెప్పారు. 

అసలు బాబును కలిసిన తర్వాత పవన్ ఎన్ని ఆస్తులు కొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అకౌంట్ లో ఎంత ఉందో చెప్పాలని అన్నారు. మంగళగిరిలో స్థలం కొనడానికి మీకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని అడిగారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎంత వచ్చిందో వెబ్ సైట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. చెప్పకపోతే ఏపీ, తెలంగాణలో ఉన్న బినామీలు సహా అన్ని వివరాలను బయటపెడతానని హెచ్చరించారు. 

ఎన్నారైల నుంచి రూ. 15 కోట్లు వసూలు చేశారని... చాలా మంది దగ్గర నుంచి విరాళాలను సేకరించారని... ఆ డబ్బులు ఏం చేశారో చెప్పాలని పోతిన డిమాండ్ చేశారు. మీ బ్లాక్ మనీ మొత్తం 'హరిహర వీరమల్లు' సినిమాపై పెడుతున్న మాట నిజం కాదా? అని ప్రశ్నించారు. 


More Telugu News