అఫిడవిట్ ప్రకారం చంద్రబాబు ఆస్తులు, కేసుల వివరాలు ఇవిగో

  • చంద్ర‌బాబు నాయుడుకు రూ.4.80 లక్షల చరాస్తులు.. భార్య‌కు రూ. 810.37 కోట్ల చరాస్తులు
  • టీడీపీ అధినేత స్థిరాస్తుల విలువ రూ. 36.31 కోట్లు
  • భువనేశ్వరికి రూ. 85.10 కోట్ల స్థిరాస్తులు 
  • గత ఐదేళ్లలో ఈ దంప‌తుల‌ ఆస్తులు 39 శాతం పెరిగిన వైనం 
  • చంద్ర‌బాబుపై 24 క్రిమినల్ కేసులు   
  • 1989 నుంచి కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుసగా గెలుస్తూ వ‌స్తున్న చంద్ర‌బాబు 
ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు త‌ర‌ఫున ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రి శుక్ర‌వారం నామినేషన్‌ పత్రాలను దాఖలు చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో చంద్రబాబుకు 1994లో కొనుగోలు చేసిన అంబాసిడర్ కారు ఉండగా, ఆయన భార్య‌ భువనేశ్వరికి సొంత వాహ‌నం లేద‌ని వెల్ల‌డైంది. అలాగే గత ఐదేళ్లలో ఈ దంప‌తుల‌ ఆస్తులు 39 శాతం పెరిగి రూ. 931 కోట్లకు చేరాయి. 2019లో ఈ జంట ఆస్తుల విలువ రూ. 668 కోట్లు.

కాగా, భర్త తర‌ఫున భువనేశ్వరి దాఖలు చేసిన నామినేషన్‌లో కూడా తన భర్త కంటే ఆమెకు ఎక్కువ ఆస్తులు ఉన్నాయని తేలింది. తాజా అఫిడవిట్ ప్రకారం చంద్ర‌బాబు నాయుడుకు రూ. 2.22 లక్షల విలువైన అంబాసిడర్ కారుతో కలిపి కేవలం రూ.4.80 లక్షల చరాస్తులు ఉన్నాయి. ఇక హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ అయిన‌ భువనేశ్వరి రూ. 763.93 కోట్ల విలువైన హెరిటేజ్‌ షేర్లు సహా రూ. 810.37 కోట్ల చరాస్తులను కలిగి ఉన్నారు.

అలాగే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన కుమారుడు నారా లోకేశ్‌తో క‌లిపి ఉమ్మడిగా ఉన్న ఇల్లు సహా టీడీపీ అధినేత స్థిరాస్తుల విలువ రూ. 36.31 కోట్లు. మ‌రోవైపు భువనేశ్వరికి రూ. 85.10 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. వీటిలో తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో వ్యవసాయ భూమి, వాణిజ్య ఆస్తులు ఉన్నాయి.

కాగా, 2022-23లో చంద్ర‌బాబు ఆదాయం శూన్యమని అఫిడవిట్‌లో పేర్కొన‌డం జ‌రిగింది. ఇదే ఆర్థిక సంవత్సరంలో ఆయ‌న‌ భార్య ఆదాయం రూ. 11.34 కోట్లు. అలాగే 2021-22లో ఆయ‌న‌ ఆదాయం రూ. 18.39 లక్షలు కాగా, భార్య‌ భువ‌నేశ్వ‌రి ఆదాయం రూ. 20.31 కోట్లు.

అలాగే చంద్ర‌బాబుపై 24 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. అమరావతి భూకుంభకోణం, ఫైబర్‌నెట్ స్కామ్, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లకు సంబంధించిన ఆరోపణలపై గతేడాది ఆయ‌న‌ అరెస్టయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌లకు 14 ఏళ్ల పాటు సీఏంగా పనిచేసిన 74 ఏళ్ల చంద్ర‌బాబు నాయుడు ఈ ఎన్నిక‌ల‌లో కూడా గెలిచి, మరోసారి అత్యున్నత పదవిని అధిష్టించాలని కోరుకుంటున్నారు.

ఇక ఆయన ఎనిమిదోసారి కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 1989 నుంచి చంద్ర‌బాబు ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుసగా గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో తన సమీప ప్రత్యర్థి వైసీపీకి చెందిన కె. చంద్రమౌళిపై 35 వేలకు పైగా ఓట్ల తేడాతో ఘ‌న‌ విజయం సాధించారు. కాగా, 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఏపీలో మే 13న ఎన్నిక‌లు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో వైఎస్ జ‌గ‌న్ నేతృత్వంలోని వైసీపీని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఢీకొన‌బోతోంది.


More Telugu News