ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేయడమే వైసీపీ పని: నారా భువనేశ్వరి

  • శ్మశానాలనూ వదల్లేదని ఆరోపణ
  • రాష్ట్రంలోని వక్ఫ్ బోర్డు భూముల్లో 80 శాతం ఆక్రమణ
  • ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలను అమలుచేయలేదని విమర్శ
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ అవినీతికి అంతేలేకుండా పోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి ఆరోపించారు. కుప్పం జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. శనివారం ఉదయం సామగుట్టపల్లి కదిరి నరసింహ స్వామి ఆలయంలో భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుప్పంలోని టీడీపీ ఆఫీసు వద్ద ముస్లిం మహిళలతో మాట్లాడారు. రాష్ట్రంలో వైసీపీ నేతల భూ ఆక్రమణలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జా చేసేస్తున్నారని మండిపడ్డారు. ప్రార్థనా స్థలాలతో పాటు శ్మశానాలనూ వదలడంలేదని తీవ్ర విమర్శలు చేశారు. వక్ఫ్ భూముల్లో దాదాపు 80 శాతం భూములను వైసీపీ ఆక్రమించిందని చెప్పారు.

ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన హామీలను ఐదేళ్ల పాలనలో జగన్ నెరవేర్చలేదని భువనేశ్వరి ఆరోపించారు. మిస్బా ఆత్మహత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. కాగా, చంద్రబాబు 75వ పుట్టిన రోజు వేడుకను నారా భువనేశ్వరి బస చేస్తున్న పీసీఎస్ మెడికల్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవి నాయుడు, భువనేశ్వరి టీమ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా భువనేశ్వరి కేక్‌ కట్ చేసి తన టీమ్ సభ్యులకు పంచారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, డాక్టర్ సురేష్, టీడీపీ కుప్పం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


More Telugu News