భారత్-పాక్ సరిహద్దులో చైనా డ్రోన్ కలకలం

  • పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో ఘటన
  • 500 గ్రాముల హెరాయిన్‌తో పట్టుబడిన డ్రోన్
  • గతేడాది 107 డ్రోన్లు కూల్చి 442 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్
పంజాబ్‌లోని భారత్-పాక్ సరిహద్దు వద్ద చైనా డ్రోన్ కనిపించి కలకలం రేపింది. అమృత్‌సర్ జిల్లాలో 500 గ్రాముల హెరాయిన్‌తో కనిపించిన ఈ డ్రోన్‌ను బీఎస్ఎఫ్ అధికారులు సీజ్ చేశారు. మాదక ద్రవ్యాల సరఫరాపై సమాచారం అందుకున్న బీఎస్ఎఫ్ అనుమానిత ప్రదేశాల్లో గాలించగా నిన్న సాయంత్రం 4.45 గంటల సమయంలో డ్రగ్ ప్యాకెట్‌తో ఉన్న ఈ డ్రోన్ కనిపించింది.

డ్రోన్‌కు డ్రగ్ ప్యాకెట్, టార్చ్‌లైట్‌ను టేపుతో చుట్టారని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రోన్ చైనా తయారీ ‘డీజేఐ మావిక్ 3 క్లాసిక్’ అని పేర్కొన్నారు.  భారత్-పాక్ సరిహద్దులో డ్రోన్లతో డ్రగ్స్ రవాణా ఇటీవలి కాలంలో ఎక్కువైంది. గతేడాది 107 డ్రోన్లను కూల్చేసిన బీఎస్ఎఫ్ 442.395 కేజీల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. దీంతోపాటు 23 ఆయుధాలు, 505 రౌండ్ల మందుగుండు స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్ పాకిస్థాన్‌కు చెందిన ముగ్గురు చొరబాటుదారులను కాల్చి చంపింది. మరో 23 మందిని పట్టుకుంది. వీరిలో ఇద్దరు స్మగ్లర్లు, 14 బంగ్లాదేశ్ జాతీయులు, 35 మంది స్మగ్లర్లు సహా 95 మంది భారతీయులను అదుపులోకి తీసుకుంది.


More Telugu News