ధోనీ బ్యాట్ నుంచి 101 మీట‌ర్ల భారీ సిక్స‌ర్‌.. షాక్‌లో బౌల‌ర్‌.. ఇదిగో వీడియో!

  • ఏకనా క్రికెట్ స్టేడియంలో ఎల్ఎస్‌జీతో సీఎస్‌కే మ్యాచ్‌
  • 9 బంతుల్లోనే అజేయంగా 28 పరుగులు బాదిన ధోనీ
  • చెన్నై ఇన్నింగ్స్ చివ‌రి ఓవ‌ర్‌లో ఎంఎస్‌డీ భారీ సిక్స్‌
  • యష్ ఠాకూర్ బౌలింగ్‌లో ధోనీ భారీ షాట్‌.. స్టాండ్‌లో ప‌డిన బంతి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2024లో రుతురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ప్ప‌టి నుండి సీఎస్‌కే మాజీ సార‌ధి మ‌హేంద్ర సింగ్ ధోనీ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. శుక్రవారం లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ) తో జ‌రిగిన‌ మ్యాచ్‌లో మ‌రోసారి త‌న ఫామ్‌ను కొన‌సాగించాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ ప్రేక్షకులను అలరించాడు. ఈ క్ర‌మంలో సీఎస్‌కే ఇన్నింగ్స్‌ ఆఖ‌రి ఓవ‌ర్‌లో ఎంఎస్‌డీ బ్యాట్ నుంచి 101 మీటర్ల భారీ సిక్సర్ న‌మోదు కావ‌డం విశేషం.

ఈ మ్యాచ్‌లో ధోనీ 9 బంతుల్లోనే రెండు బౌండ‌రీలు, ఒక‌ సిక్సర్ సాయంతో అజేయంగా 28 పరుగులు బాదాడు. దీంతో చెన్నై జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. రవి బిష్ణోయ్ వేసిన 18వ ఓవర్‌లో మొయిన్ అలీ అవుట్ అయిన తర్వాత నెం.8 వద్ద బ్యాటింగ్‌కు వచ్చిన 42 ఏళ్ల ధోని త‌న‌దైన శైలిలో కొన్ని అద్భుత‌మైన స్ట్రోక్‌లతో ఇన్నింగ్స్‌లో ఊపును తెచ్చాడు.

క్రీజులోకి వ‌స్తూ వ‌స్తూనే ధోనీ ఎడమచేతి వాటం పేసర్ మొహ్సిన్ ఖాన్‌పై విరుచుకుప‌డ్డాడు. అతని బౌలింగ్‌లో డీప్ ఎక్స్‌ట్రా కవర్ మీదుగా బౌండ‌రీ కొట్టాడు. ఇక చివరి ఓవర్‌లో యష్ ఠాకూర్ బౌలింగ్‌లో ధోనీ మ‌రింత రెచ్చిపోయాడు. త‌న అపార‌మైన‌ అనుభవాన్ని ఉపయోగించి ఈ ఓవర్‌లో ఏకంగా సీఎస్‌కేకు 19 పరుగులు అందించాడు. ఇదే ఓవ‌ర్‌లోనే మూడో బంతిని ఎంఎస్‌డీ స్టాండ్స్‌లోకి పంపించాడు. ధోనీ కొట్టిన ఈ సిక్స‌ర్ ఏకంగా 101 మీటర్ల దూరం వెళ్లింది.

ఇక మ్యాచ్‌ చివ‌రి ఓవ‌ర్‌లో ధోనీ క్రీజులో ఉంటే అంతే సంగ‌తులు. బౌల‌ర్‌పై ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ‌తాడు. ఇలా ఐపీఎల్ 20వ ఓవర్‌లో ధోనీ ఇప్పటివరకు 65 సిక్సర్లు కొట్టాడు. ఈ సీజ‌న్‌లోనూ ధోనీ 5 ఇన్నింగ్స్‌లలో 255.88 స్ట్రైక్ రేట్‌తో 87 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో వికెట్ కీపర్‌గా 5000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ధోనీ ఉన్న‌ ఫామ్‌ను చూసి ఆయ‌న అభిమానులు ఖుషీ అవుతున్నారు.


More Telugu News