మీ కొడుక్కి ఓటేయకపోయినా... కనీసం ఆశీర్వదించండి: కాంగ్రెస్ నేత ఆంటోనీకి రాజ్‌నాథ్ సింగ్ విజ్ఞప్తి

  • పథనంథిట్టలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏకే ఆంటోనీ కుమారుడు
  • ఆంటోనీ ఇబ్బందిని అర్థం చేసుకోగలనన్న రాజ్‌నాథ్ సింగ్
  • ఆయనపై కాంగ్రెస్ ఒత్తిడి ఉందని వ్యాఖ్య
'మీ కొడుక్కి ఓటు వేయకపోయినా... కనీసం తండ్రిగా ఆశీర్వదించండి' అని కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీకి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. ఆంటోనీ తనయుడు అనిల్ ఆంటోనీ కేరళలోని పథనంథిట్ట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఏకే ఆంటోనీ గారూ... మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా... మీరు మీ కుమారుడికి ఓటు వేయకపోయినా పర్లేదు.. కనీసం ఆశీస్సులైనా అందించండని పేర్కొన్నారు. కొన్ని రోజుల క్రితం ఆంటోనీ చేసిన వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యం కలిగించాయన్నారు. ఆంటోనీ ఇబ్బందిని అర్థం చేసుకోగలనని... కాంగ్రెస్ ఒత్తిడి వల్ల అలా మాట్లాడి ఉండవచ్చునన్నారు. 

ఇటీవల ఏకే ఆంటోనీ మాట్లాడుతూ... బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తన కొడుకు ఓడిపోవాలని, ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీయే తన మతం అని వెల్లడించారు. ప్రస్తుత ఎన్నికలు భారత్, దాని రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించినవని వ్యాఖ్యానించారు. తన తండ్రి వ్యాఖ్యలపై అనిల్ అంటోనీ కూడా ఘాటుగానే స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో కాలంచెల్లిన నేతలు ఉన్నారని... తన తండ్రి పరిస్థితిని చూస్తే జాలేస్తోందని పేర్కొన్నారు.


More Telugu News