ఎన్నికల వేళ రాష్ట్రాన్ని చుట్టేయనున్న రేవంత్‌రెడ్డి.. 50 సభలు.. 15 రోడ్ షోలతో షెడ్యూల్

  • నేడు మహబూబ్‌నగర్‌లో వంశీచంద్‌రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరు
  • ఈ నెల 25 వరకు ప్రతీ సెగ్మెంట్‌లోనూ పర్యటన
  • ఇతర రాష్ట్రాల్లోనూ స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం
  • ఇప్పటికే కేరళలో రాహుల్, కేసీ వేణుగోపాల్ కోసం ప్రచారం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోకి దూకుతున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆయన 12 నుంచి 14 స్థానాల్లో పార్టీని గెలిపించి తీరాలని పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రమంతా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. సొంత జిల్లా అయిన మహబూబ్‌నర్ నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టబోతున్నారు. పార్టీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనుండగా ఆ కార్యక్రమానికి రేవంత్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు.

అక్కడి నుంచి మహబూబాబాద్ చేరుకుని బలరాం నాయక్ నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 25 నామినేషన్ దాఖలుకు ఆఖరు రోజు కాగా, అప్పటి వరకు దాదాపు అన్ని సెగ్మెంట్లలోనూ నామినేషన్ల కార్యక్రమానికి రేవంత్ హాజరవుతారు. రేపు మెదక్ అభ్యర్థి నీలం మధు, ఎల్లుండి భువనగిరి అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, 22న ఆదిలాబాద్ అభ్యర్థి ఆత్రం సుగుణ, 23న నాగర్ కర్నూలు అభ్యర్థి మల్లు రవి, 24న జహీరాబాద్ అభ్యర్థి సురేశ్ షెట్కార్ నామినేషన్ కార్యక్రమాల్లో రేవంత్‌రెడ్డి పాల్గొనేలా ప్రణాళిక సిద్ధమైంది.

మొత్తంగా 50 బహిరంగ సభలు, 15 రోడ్‌షోలలో సీఎం పాల్గొంటారు. ఇందుకోసం హెలికాప్టర్‌ను ఉపయోగించుకోనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు జాతీయ స్థాయిలోనూ ఆయనను స్టార్ క్యాంపెయినర్‌గా వాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పోటీచేస్తున్న కేరళలోని వయనాడ్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పోటీచేస్తున్న అళప్పుళ సెగ్మెంట్లలో రేవంత్ ప్రచారం నిర్వహించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, గుజరాత్‌లోనూ ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం.


More Telugu News