‘రాకెట్లు అంతరిక్షం వైపు పంపండి’.. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల మధ్య ఎలాన్ మస్క్ పోస్ట్

  • ఇజ్రాయెల్–ఇరాన్ కు పరోక్షంగా ప్రపంచ కుబేరుడి శాంతి సందేశం
  • ఇరాన్ ఎయిర్ పోర్ట్ పై ఇజ్రాయెల్ దాడి వార్తల నేపథ్యంలో తన ‘ఎక్స్’ ఖాతాలో కామెంట్
  • గతేడాది ఇజ్రాయెల్ లో రెండు రోజులపాటు పర్యటించిన మస్క్ 
గాజా వివాదం నేపథ్యంలో ఇజ్రాయెల్‌‌–ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీసేలా ఉండటంతో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు. ఇరు దేశాలకు పరోక్షంగా శాంతి సందేశం ఇచ్చారు. ‘ఇరు దేశాలు పరస్పరం రాకెట్లు సంధించుకోవడం కాదు.. దాని బదులు అంతరిక్షంలోకి వాటిని పంపాలి’ అంటూ మస్క్ తన ‘ఎక్స్’ ఖాతాలో శుక్రవారం పోస్ట్ చేశారు. తన పోస్ట్ కు ఓ రాకెట్ ఫొటోను కూడా జత చేశారు.  ఇరాన్ ఎయిర్ పోర్ట్ పై ఇజ్రాయెల్ దాడి చేసినట్లు వార్తలు వెలువడిన సుమారు గంట తర్వాత మస్క్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అమెరికాలోని క్యాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే స్పేస్ ఎక్స్ అనే స్పేస్ క్రాఫ్ట్ తయారీ, శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ కూడా ఎలాన్ మస్క్ కు ఉంది.

గతేడాది నవంబర్ లో ఎలాన్ మస్క్ ఇజ్రాయెల్ లో రెండు రోజులపాటు పర్యటించారు. ఈ సందర్భంగా అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి ప్రాంతాలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎలాన్ మస్క్ కు చూపించారు. అయితే ఈ పర్యటన తర్వాత ఆయన్ను గాజా సందర్శన కోసం హమాస్ ఆహ్వానించింది. ఇజ్రాయెల్ బాంబుల దాడిలో తమ ప్రాంతం ఏ మేరకు ధ్వంసమైందో చూడాలని కోరింది. ఇజ్రాయెల్ పై గతేడాది అక్టోబర్ 7 దాడి తర్వాత గాజాపై ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగింది. గత ఆరు నెలలుగా ఈ దాడి కొనసాగుతూనే ఉంది.

స్పేస్ ఎక్స్ కు చెందిన శాటిలైట్ నెట్ వర్క్ ‘స్టార్ లింక్’ ఇజ్రాయెల్ తోపాటు, గాజా స్ట్రిప్ లోని కొన్ని ప్రాంతాల్లో సేవలు అందించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో లైసెన్స్ పొందింది. గాజాలోని ఫీల్డ్ ఆస్పత్రిలో స్టార్ లింక్ సేవలు ఉపయోగించుకొనేందుకు ఆమోదముద్ర వేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. అలాగే  తమ ఇంటర్నెట్ సేవలను హమాస్ పొందకుండా నిరోధించేందుకు స్టార్ లింక్ అంగీకరించింది.


More Telugu News