బీజేపీలోకి పెద్దపల్లి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ?.. టికెట్ కేటాయించకపోవడమే కారణమా?

  • గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన వెంకటేశ్ నేత
  • ఇటీవల కాంగ్రెస్‌లో చేరినా టికెట్ కేటాయించని పార్టీ
  • నామినేషన్ వేసేందుకు రెడీగా ఉండాలంటూ బీజేపీ నుంచి కబురు
  • ఒకట్రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానన్న వెంకటేశ్ నేత
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చేందుకు రెడీ అయ్యారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీచేసి విజయం సాధించిన ఆయన ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆయనకు కాకుండా గడ్డం వంశీకృష్ణకు టికెట్ కేటాయించింది. దీంతో మనస్తాపం చెందిన ఆయన పార్టీ వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడంతో గెలుపుపై ఆ పార్టీ ధీమాగా ఉంది.

మరోవైపు, బీజేపీ తరపున ఇక్కడి నుంచి గోమాసె శ్రీనివాస్ బరిలో ఉన్నారు. అయితే, కాంగ్రెస్ అభ్యర్థిని ఎదుర్కొనేందుకు శ్రీనివాస్‌కున్న బలం సరిపోదని భావిస్తున్న బీజేపీ బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి అమిత్ షా ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యులు వెంకటేశ్ నేత పేరును సూచించినట్టు తెలిసింది. దీంతో నామినేషన్‌కు రెడీగా ఉండాలని ఆయనకు పార్టీ నుంచి కబురు వెళ్లినట్టు తెలిసింది. బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై వెంకటేశ్ నేత స్పందిస్తూ ఒకట్రెండు రోజుల్లో దీనిపై స్పష్టత ఇస్తానని చెప్పారు.


More Telugu News