కేజ్రీవాల్‌ను జైల్లో చంపేందుకు కుట్ర: ఆప్ ఆరోపణ

  • పదేపదే అభ్యర్థించిన కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ ఇవ్వడంలేదన్న ఆప్ మంత్రి అతిశీ  
  • ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడించకపోతే జైల్లోనే చంపాలని చూస్తున్నారని ఆరోపణ
  • టైప్-2 డయాబెటీస్‌తో గత 30 ఏళ్లుగా కేజ్రీవాల్ బాధపడుతున్నారన్న ఢిల్లీ మంత్రి
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను జైల్లో చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆప్ ఆరోపించింది. కేజ్రీవాల్ టైప్2 డయాబెటీస్ రోగి అని, ఎన్నిసార్లు అభ్యర్థించినా ఇన్సులిన్ ఇవ్వడంలేదని ఢిల్లీ మంత్రి అతిశీ అన్నారు. ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను బీజేపీ ఓడించలేకపోతే ఆయనను జైల్లో ఉంచి చంపేందుకు పథకం పన్నుతున్నారని ఆమె ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహంతో బాధపడుతున్నారనే విషయం అందరికీ తెలుసునని, గత 30 ఏళ్లుగా ఆయన ఈ సమస్యతో ఇబ్బందిపడుతున్నారని ఆమె గుర్తుచేశారు. షుగర్ స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజూ 54 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుంటారని ప్రస్తావించారు.

‘‘ ఏ డాక్టర్‌నైనా అడగండి. తీవ్రమైన మధుమేహం ఉన్న వ్యక్తి మాత్రమే ఈ స్థాయిలో ఇన్సులిన్ తీసుకుంటారు. ఇంట్లో వండిన ఆహారాన్ని తినడానికి కోర్టు అందుకే అనుమతిచ్చింది. డాక్టర్ సూచించిన ఆహారాన్ని మాత్రమే తినాలని సూచించింది. కానీ కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని దెబ్బతీయాలని ఈడీ ద్వారా బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకే ఈడీ పదే పదే అబద్ధాలు చెబుతోంది’’ అని అతిశీ ఆరోపణలు గుప్పించారు.

కాగా బెయిల్ కోసం షుగ‌ర్ లెవెల్స్ పెరిగేలా కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నార‌ని రౌస్ అవెన్యూ కోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) తెలిపిన విషయం తెలిసిందే. వాటి వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ పెరిగితే బెయిల్ అడ‌గాల‌నేది కేజ్రీవాల్ ప్లాన్ అని పేర్కొంది. దీంతో కేజ్రీవాల్ డైట్ ఛార్ట్ స‌మ‌ర్పించాల‌ని జైలు అధికారులను న్యాయ‌స్థానం ఆదేశించింది. త‌దుప‌రి వాద‌న‌లు శుక్ర‌వారం వింటామ‌ని తెలిపింది. మ‌రోవైపు ఈడీ వాద‌న‌ను కేజ్రీవాల్ త‌ర‌ఫు న్యాయ‌వాది వివేక్ జైన్ కొట్టిపారేశారు. 

కాగా, ఇటీవ‌ల షుగ‌ర్ లెవెల్స్ ప‌డిపోతున్నాయ‌ని క్ర‌మం త‌ప్ప‌కుండా త‌నిఖీ చేసేందుకు వారానికి మూడుసార్లు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా త‌న వ్య‌క్తిగ‌త వైద్యుడికి అనుమ‌తి ఇవ్వాలంటూ కోర్టులో పిటిష‌న్‌ దాఖ‌లు చేశారు. దీనిని ఈ వ్యతిరేకించిన నేపథ్యంలో ఆప్ తాజా ఆరోపణలు చేసింది.


More Telugu News