కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బతకనీయదు... బీఆర్ఎస్‌లోకి 20 మందితో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు: కేసీఆర్

  • 104 మంది ఎమ్మెల్యేలున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే బీజేపీ కూల్చే ప్రయత్నాలు చేసిందన్న కేసీఆర్
  • ఇక 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతకనిస్తుందా? అన్న కేసీఆర్
  • బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన నేతలు బాధపడుతున్నారని వ్యాఖ్య
  • 20 మంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలా సర్? అని ఓ నేత అడిగితే ఇప్పుడే వద్దని వారించానన్న కేసీఆర్
104 మంది ఎమ్మెల్యేలు ఉన్న మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే బీజేపీ కూల్చే ప్రయత్నాలు చేసిందని... ఇక 64 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతకనిస్తుందా? అని కేసీఆర్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో భ‌విష్య‌త్తు బీఆర్ఎస్‌దే అన్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో గెలుపు కూడా మ‌న‌దే అన్నారు. మనం గ‌ట్టిగా పోరాడితే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో మంచి ఫ‌లితాలు వస్తాయన్నారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన నేత‌లు బాధపడుతున్నారన్నారు. అధికారముందని కాంగ్రెస్‌లోకి వెళ్తే ఇక్క‌డంతా బీజేపీ క‌థ న‌డుస్తోంద‌ని ఓ నాయ‌కుడు త‌న‌తో వాపోయాడన్నారు. 20 మంది ఎమ్మెల్యేల‌ను తీసుకొని రావాలా సర్? అని ఓ సీనియ‌ర్ కీల‌క నేత‌ త‌న‌ను సంప్రదించాడన్నారు. కానీ ఇప్పుడే వ‌ద్ద‌ని తాను వారించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో టీమ్ వ‌ర్క్ లేదని, స్థిర‌త్వం లేదన్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 8 లోక్ స‌భ సీట్ల‌లో గెలుస్తామ‌ని స‌ర్వేలు చెబుతున్నాయని... మ‌రో మూడు స్థానాల్లో విజ‌యావ‌కాశాలు ఉన్నాయన్నారు. రైతు స‌మ‌స్య‌లు అజెండాగా ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. రైతు స‌మ‌స్య‌ల‌పై పోస్ట్ కార్డు ఉద్య‌మం ఉద్ధృతం చేయాలన్నారు. ఒక్కో పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ల‌క్ష పోస్ట్‌కార్డులు రాయాలని... రైతుల క‌ల్లాల కాడికి వెళ్లి రూ.500 బోన‌స్‌పై ప్ర‌భుత్వాన్ని నిలదీయాలన్నారు. ప్ర‌భుత్వ హామీల‌ను కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను మనం అనుకూలంగా మార్చుకోవాలన్నారు.


More Telugu News