చంద్రబాబు వంటి దుర్మార్గులు ఉంటార్రా బాబూ అని చెప్పాను... మా అబ్బాయి వినలేదు: పేర్ని నాని

  • నిన్న మచిలీపట్నంలో కూటమి సభ
  • పేర్ని నాని లక్ష్యంగా చంద్రబాబు విమర్శనాస్త్రాలు 
  • నేడు చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న కృష్ణా జిల్లా పెడన, మచిలీపట్నంలో ప్రజాగళం, వారాహి విజయభేరి సభలు నిర్వహించి వైసీపీ నేతలను తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు, పవన్ ల వ్యాఖ్యలపై మాజీ మంత్రి, మచిలీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. 

75 ఏళ్ల వయసొచ్చిన చంద్రబాబు పాపపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇంజినీరింగ్ చదువుకుని, ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, నా ఊరికి ఏదో ఒకటి చేయాలి అని తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తే అతడిపై అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు.

"చంద్రబాబు వంటి దుర్మార్గులు ఉంటార్రా బాబూ... ఇలాంటి జీవితం మనకు అవసరమా అని కూడా మా అబ్బాయికి చెప్పాం... కానీ, చంద్రబాబు, కొల్లు రవీంద్ర వంటి పాపభీతి లేని దుర్మార్గులు ఉన్నంత మాత్రాన వాళ్లకు భయపడి నేను ప్రజాసేవ మానుకుంటానా అని మా అబ్బాయి ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాడు. అటువంటి నవయువకుడి గురించి పచ్చి పాపపు మాటలు మాట్లాడుతున్నారు. 

జీవో.217 మత్స్యకారులకు గుదిబండగా మారిందంటున్నారు... అసలా జీవోలో ఏముంది? ఎంతసేపూ మోసపు మాటలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు బ్రిటీష్ వారి పాలనలో బందరు చరిత్ర వెలిగిపోయింది అంటున్నారు. నల్లదొరవు నువ్వు కూడా పాలించావు కదా... నీ హయాంలో బందరు ఎందుకు వెలగిపోలేదు?

గతంలో బందరులో కలెక్టర్ సహా, ఉన్నతాధికారులెవరూ నివాసం ఉండలేదు. అందరూ విజయవాడలో ఉండేవారు. త్రివర్ణ పతాకాన్ని కూడా వీఆర్ఓ ఎగరేసేవారు. కృష్ణా జిల్లా నీడలో మసకబారిపోయిన బందరు చరిత్ర మార్చింది సీఎం జగన్. 

మేనిఫెస్టోలో చెప్పిన మేరకు 2022 మార్చి నెలలో... విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లాను ప్రకటించి, బందరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి పాత కృష్ణా జిల్లాగా ఏర్పాటు చేశారు. ఆ విధంగా మళ్లీ బందరుకు పూర్వవైభవం తీసుకువచ్చింది సీఎం జగన్. ఎందుకు చంద్రబాబు బొంకు మాటలు మాట్లాడతారు?" అని పేర్ని నాని ధ్వజమెత్తారు.


More Telugu News