గుండెలేని వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండాలా? ఒక్కసారి ఆలోచించండి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

  • భువనగిరి గురుకుల స్కూల్లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి ప్రశాంత్ మృతి
  • ఇది ప్రజాపాలనా? లేక ప్రజలపై ప్రతీకార పాలనా? అని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం
  • డాక్ట‌రో, ఇంజినీరో కావాల‌ని చ‌దువుకోవ‌డానికి వ‌చ్చిన ప్ర‌శాంత్ ఫుడ్ పాయిజ‌న్‌తో చ‌నిపోవ‌డం బాధాకరమని వ్యాఖ్య
గుండెలేని వ్యక్తి... పట్టపగలే అబద్ధాలు చెప్పే వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉండాలా?... ఒక్కసారి ఆలోచించండని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... భువ‌న‌గిరి గురుకుల పాఠ‌శాల‌లో 6వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థి చిన్న‌ల‌చ్చి ప్ర‌శాంత్ మృతి చెందిన ఘనటపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.

ఇది ప్ర‌జా పాల‌నా? లేక ప్ర‌జ‌ల‌పై ప్ర‌తీకార పాల‌నా? అని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. డాక్ట‌రో, ఇంజినీరో కావాల‌ని చ‌దువుకోవ‌డానికి వ‌చ్చిన ప్ర‌శాంత్ ఫుడ్ పాయిజ‌న్‌తో చ‌నిపోవ‌డం బాధాకరమన్నారు. ఇదే భువ‌న‌గిరిలో రెండు నెల‌ల క్రితం ఇద్ద‌రు పేద అమ్మాయిలు సంక్షేమ హాస్ట‌ల్‌లో ఉంటూ ఉరేసుకుని చనిపోయారని గుర్తు చేశారు. ఈ ఘ‌ట‌న‌ల‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించలేదన్నారు. అలాంటి వ్యక్తి మనకు సీఎంగా ఉండాలా? మన బిడ్డల ప్రాణాలు ఇతరుల చేతిలో పెడదామా? అని ప్రశ్నించారు.

ప్రశాంత్ ఇటీవల డయేరియాకు గురయ్యాడని... రెండ్రోజుల తర్వాత అతని ఆరోగ్యం మరింత క్షీణించిందని.... అయినప్పటికీ తరగతులకు హాజరయ్యాడని ఆర్ఎస్పీ తెలిపారు. భువ‌న‌గిరి సోష‌ల్ వెల్ఫేర్ స్కూల్ ప్రిన్సిప‌ల్ ఆరు రోజులుగా స్కూల్‌కు రావ‌డం లేదని, అక్క‌డున్న ఆర్వో ప్లాంట్ కూడా ప‌ని చేయ‌డం లేదన్నారు. గురుకులాల్లో ఇలాంటి పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ‌లోని సంక్షేమ పాఠ‌శాల‌ల‌కు బాధ్యులైన మంత్రి ఎవ‌రో తెలుసా? అది మరెవరో కాదు రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఇప్పటి వరకు ఒక్క సంక్షేమ పాఠశాలను సందర్శించలేదని... గురుకులాల ప‌నితీరును కూడా ఆయ‌న స‌మీక్షించ‌లేదన్నారు. రేవంత్ రెడ్డి సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాలని డిమాండ్ చేశారు.


More Telugu News