కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు

  • సాప్ట్ వేర్ ఉద్యోగికి బెదిరింపులు
  • గెస్ట్ హౌస్ లో నిర్బంధించి దాడి
  • బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై బంజారాహిల్స్‌ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. తనను బెదిరించి డబ్బులు లాక్కున్నారంటూ ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో కన్నారావుతో పాటు మరో ఐదుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. బాధితుడు, పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ సమస్య పరిష్కారం కోసం అప్పట్లో కన్నారావును ఆశ్రయించినట్లు సాఫ్ట్ వేర్ ఉద్యోగి విజయవర్ధన్ చెప్పారు. అయితే, తన వద్ద భారీగా నగలు, నగదు ఉన్నాయని నందిని అనే మహిళ ద్వారా కన్నారావుకు తెలిసిందన్నారు. దీంతో తనను గెస్ట్ హౌస్ లో నిర్బంధించి, డబ్బుల కోసం దాడి చేశారని ఆరోపించారు.

పోలీస్ అధికారి భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తెలుసని, డబ్బులు ఇవ్వకుంటే జైలుకు పంపిస్తానని కన్నారావు బెదిరించినట్లు విజయవర్ధన్ వాపోయారు. దీంతో చేసేదేంలేక రూ.60 లక్షల నగదు, 97 తులాల బంగారు నగలను కన్నారావుకు అప్పగించినట్లు తెలిపారు. ఈ విషయంపై తాజాగా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విజయవర్ధన్ పేర్కొన్నారు. విజయవర్ధన్ ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు.. కన్నారావు, నందినితో పాటు మొత్తం ఐదుగురిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కాగా, మాజీ సీఎం కేసీఆర్ అన్న కొడుకు కన్నారావుపై మన్నెగూడ భూవివాదంలో ఇప్పటికే కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు కన్నారావును అరెస్టు చేసి జైలుకు పంపించారు.


More Telugu News