పేటీఎం కస్టమర్లకు ఇకపై కొత్త యూపీఐ ఐడీలు!

  • కొత్త పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు మారనున్న పేటీఎం కస్టమర్లు
  • కస్టమర్ల యూపీఐ ఐడీల్లో కూడా ఈ మేరకు మార్పులు 
  • @paytm స్థానంలో @ptsbi, @pthdfc, @ptaxis, @ptyes యూపీఐ ఐడీలు
  • మైగ్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన పేటీఎం
పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కార్యకలాపాలపై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం మాతృ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ (ఓసీఎల్) కీలక నిర్ణయం తీసుకుంది. చెల్లింపులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పేటీఎం బ్యాంకు యూపీఐ కస్టమర్లను ఇతర పేమెంట్ సర్వీసు ప్రొవైడర్లకు (బ్యాంకులు) మార్చే మైగ్రేషన్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు పేటీఎం బ్యాంకు యూపీఐ ఐడీ @paytm లో కూడా మార్పులు చోటుచేసుకోనున్నాయి. పేటీఎం కస్టమర్లు.. ఏక్సిస్ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా, యస్ బ్యాంకులకు మారనున్నారు. ఫలితంగా ఆయా కస్టమర్లకు @ptsbi, @pthdfc, @ptaxis, @ptyes ఐడీలు అమల్లోకి వస్తాయి. 

మైగ్రేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు వచ్చాయని ఓసీఎల్ పేర్కొంది. బ్యాంకు కార్యకలాపాలు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం పేటీఎం.. థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కస్టమర్లను ఇతర పేమెంట్ ప్రొవైడర్లకు మార్చే ప్రక్రియను ప్రారంభించింది. 

నిబంధనలు పాటించని కారణంగా పేటీఎం బ్యాంకు కార్యకలాపాలపై ఆర్బీఐ జనవరి 31న ఆంక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29 తరువాత పేమెంట్స్ బ్యాంకు అకౌంట్లు, వాలెట్లు, ఫాస్టాగ్ కోసం కస్టమర్ల నుంచి డిపాజిట్లు, టాప్ అప్‌లు నిలిపివేయాలని ఆదేశించింది. ఆ తరువాత మార్చి 15 వరకూ ఈ డెడ్‌లైన్‌ను పొడిగించింది. ఆ తరువాత నుంచీ పేటీఎం.. థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్‌గా కొనసాగుతోంది.


More Telugu News