జనసేన పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించి ప్రమాణం చేయించిన పవన్ కల్యాణ్

  • ఏపీలో రేపటి నుంచి నామినేషన్ల పర్వం
  • నేడు మంగళగిరిలో పార్టీ కార్యాలయానికి వచ్చిన జనసేన అభ్యర్థులు
  • బీ-ఫారాలు అందించి శుభాకాంక్షలు తెలిపిన పవన్
  • పాలకొండ అభ్యర్థికి తప్ప మిగతా అందరికీ బీ-ఫారాలు 
ఏపీలో రేపు (ఏప్రిల్ 18) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది. ఈ నేపథ్యంలో, జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ శ్రీరామనవమి నాడు తమ పార్టీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందించారు. టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తు కారణంగా జనసేన పార్టీ ఈసారి 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఇవాళ పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థికి మినహా మిగతా 20 అసెంబ్లీ అభ్యర్థులు, రెండు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థులకు పవన్ కల్యాణ్ బీ-ఫారాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పాలకొండ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ రావడం ఆలస్యం కావడంతో ఆయనకు తర్వాత బీ-ఫారం అందజేయనున్నారు. 

జనసేన అభ్యర్థులకు బీ ఫారం ఇచ్చి ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్ 

3 కాలాల ప్రకృతి ఆశీస్సులతో, తరగని ప్రకృతి వనరులతో, సుదీర్ఘ సాగర తీరంతో సకల సంపదలకు నెలవైనది ఆంధ్రప్రదేశ్. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల మనకు తిప్పలు తప్పడం లేదు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను పునర్ నిర్మించుకోవలసి ఉంది. 

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు, కనుక వారికి జవాబుదారీగా ఉంటూ, పారదర్శక పాలన అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది. తెలుగువారి జీవన రేఖ పోలవరం నిర్మాణం పూర్తి, నదుల అనుసందానం, సామాజిక న్యాయం, యువతకు విద్యా, ఉద్యోగావకాశాలు, మహిళలకు సముచిత స్థానం, జనం మెచ్చే రాజధాని, ప్రజలకు నచ్చే ప్రభుత్వమే పాలనకు గీటురాయి కావాలి.

మన లక్ష్యమైన ప్రతీ చేతికి పని, ప్రతీ చేనుకు నీరు అందించడం ద్వారా, వలసలు, పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు భూమిక సిద్ధం చెయ్యడమే మన అందరి ఉమ్మడి భాధ్యత. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన - బీజేపి లతో కూడిన NDA కూటమి గెలుపే కర్తవ్యంగా కృషిచేస్తానని, మన పార్టీ నియమనిబంధనలకు కట్టుబడుతూ, కూటమి అభ్యర్థిగా, పైన తెలిపిన ప్రతీ మాటలు కట్టుబడి ఉంటానని భారత రాజ్యంగం సాక్షిగా ప్రతిజ్ఞ జేస్తున్నాము... జై జనసేన జైహింద్.


More Telugu News