పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్ ను కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్తలు

  • భూమికి 2,000 కాంతి సంవత్సరాల దూరంలో గుర్తింపు
  • సూర్యుడి ద్రవ్యరాశికన్నా ఏకంగా 33 రెట్లు పెద్దది
  • గయా బీహెచ్3గా నామకరణం
మన పాలపుంతలో ఇప్పటివరకు ఎవరూ కనుగొనని అతిపెద్ద స్టెల్లార్ బ్లాక్ హోల్ (కృష్ణ బిలం)  ను ఖగోళ శాస్ర్తవేత్తలు తాజాగా గుర్తించారు. ఈ కృష్ణ బిలం ద్రవ్య రాశి సూర్యుడికన్నా ఏకంగా 33 రెట్లు పెద్దగా ఉంది. దీనికి గయా బీహెచ్3 అని పేరు పెట్టారు. ఇది భూమికి 2,000 కాంతి సంవత్సరాల దూరంలో గరుడ నక్షత్ర మండలంలో ఉంది. 

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన గయా మిషన్ ద్వారా సేకరించిన డేటాను విశ్లేషిస్తుండగా అనుకోకుండా ఈ బ్లాక్ హోల్ ను గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఖగోళ పరిశోధకుడు పాస్కల్ పనుజ్జో ఏఎఫ్ పీ వార్తాసంస్థకు తెలిపారు. గయా మిషన్ అనేది పాలపుంతలో ఎక్కడెక్కడ ఎలాంటి నక్షత్రాలు ఉన్నయో గుర్తించే ప్రాజెక్టు. ఆకాశంలోని నక్షత్రాల కచ్చితమైన స్థానం, పరిభ్రమణాన్ని తెలియజేసే గయా టెలిస్కోప్ ద్వారా పరిశోధకులు గయా బీహెచ్3ని గుర్తించారు.  

అన్నిటికన్నా పెద్దది
మన పాలపుంతలో ఇప్పటికే ఉన్న స్టెల్లార్ బ్లాక్ హోల్స్ కన్నా గయా బీహెచ్3 కృష్ణ బిలం ద్రవ్యరాశి చాలా పెద్దదని శాస్ర్తవేత్తలు నిర్ధారించారు. “పక్కనే ఉన్నప్పటికీ ఇప్పటివరకు గుర్తింపునకు నోచుకోని అధిక ద్రవ్యరాశి గల బ్లాక్ హోల్ ను గుర్తిస్తామని మేం ఊహించలేదు” అని పనుజ్జో ఓ ప్రకటనలో చెప్పారు. అస్థిరంగా కదులుతున్న ఓ నక్షత్రాన్ని గుర్తించే క్రమంలో దాని పక్కనే ఉన్న బ్లాక్ హోల్ బయటపడింది.

మన పాలపుంతలో గుర్తించడం తొలిసారి
“సూర్యుడికన్నా కొంత చిన్నదైన (సూర్యుడి ద్రవ్యరాశిలో సుమారు 75 శాతం), కాంతివంతమైన ఓ నక్షత్రం బ్లాక్ హోల్ చుట్టూ పరిభ్రమిస్తున్నట్లు గమనించాం. భారీ నక్షత్రాలు ఉనికి కోల్పోయే క్రమంలో కుప్పకూలి స్టెల్లార్ బ్లాక్ హోల్స్ గా మారతాయి. అయితే ఇవి అతి భారీ కృష్ణ బిలాలకన్నా చిన్నవే. అలాంటి కృష్ణ బిలాలు సుదూర పాలపుంతల్లో ఉన్నట్లు గురుత్వాకర్షణ తరంగాల ద్వారా గుర్తించినా మన పాలపుంతలో ఇప్పటి వరకు గుర్తించలేదు” అని పనుజ్జో తెలిపారు.

ఇప్పటికే రెండు బ్లాక్ హోల్స్ ను గుర్తించిన గయా టెలిస్కోప్
బీహెచ్3 అనేది ఒక క్రియారహిత బ్లాక్ హోల్. దాని సహచర నక్షత్రానికి ఎంతో సుదూరంలో ఉంది. అందుకే ఆ నక్షత్రంలోని పదార్థాన్ని లాక్కోలేకపోయింది. దీనివల్ల అది ఎక్స్ రేలను విడుదల చేయట్లేదు. అందుకే దాన్ని గుర్తించడం కష్టమైంది. గయా టెలిస్కోప్ పాలపుంతలో ఇప్పటికే రెండు నిష్క్రియా కృష్ణ బిలాలను (గయా బీహెచ్1, గయా బీహెచ్2) గుర్తించింది. ఈ టెలిస్కోప్ గత పదేళ్లుగా భూమికి, సూర్యుడికి మధ్య 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్ రేంజ్ పాయింట్ 2 నుంచి పనిచేస్తోంది. 2022లో 180 కోట్ల నక్షత్రాల స్థానాలు, కదలికలతో కూడిన 3డీ మ్యాప్ ను పంపింది.


More Telugu News