కాంగ్రెస్‌ను టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులే కూల్చేస్తాం... ఎన్టీఆర్ వెన్నుపోటులో బాబు వెంటే కేసీఆర్: మంత్రి కోమటిరెడ్డి

  • దేశంలోనే దరిద్రమైన పాలన అందించిన ఘనత కేసీఆర్‌దేనని ఎద్దేవా
  • రేవంత్ రెడ్డిని చూడలేక కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శ
  • మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్‌లో ఎవరూ మిగలరని వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డి రాజకీయాల్లో స్వతంత్రంగా ఎదిగిన వ్యక్తి అని ప్రశంస
కేసీఆర్ కనుక కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే బీఆర్ఎస్ పునాదులే కూల్చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన సమయంలో కేసీఆర్ కూడా చంద్రబాబు వెంటే ఉన్నారన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశంలోనే దరిద్రమైన పాలించిన అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూడలేకే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కనుక గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీలో మిగలడానికి ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. మరో మూడు నెలల్లో బీఆర్ఎస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు.

రేవంత్ రెడ్డి రాజకీయాల్లో స్వతంత్రంగా ఎదిగి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అని ప్రశంసించారు. మెదక్‌లో వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేసినా బీఆర్ఎస్ గెలిచేది లేదన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ అంశంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. రావులు అందరూ జైలుకు వెళితే కనుక చర్లపల్లి జైలు సరిపోదని ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 15 లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు.


More Telugu News