ఏపీలో నేడు ఈ మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. వాతావరణశాఖ హెచ్చరిక

  • ప్రజలపై నిప్పుల వాన కురిపిస్తున్న సూరీడు
  • శ్రీకాకుళం జిల్లా కొవిలంలో నిన్న 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • నిన్న 88 మండలాల్లో వడగాలులు.. నేడు 46 మండలాల్లో
  • వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు బయటకు రావొద్దని హెచ్చరికలు
ఈసారి సూరీడు ప్రజలపై పగ పెంచుకున్నట్టు ఉన్నాడు. నిప్పుల వాన కురిపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. మండుతున్న ఎండలకు తోడు వడగాలులు కూడా జనాన్ని ఊపిరి తీసుకోకుండా చేస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జనం బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. దీంతో వాతావరణశాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీచేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కొవిలంలో నిన్న 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లోనూ 45కుపైగా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. నేడు పలు జిల్లాల్లో 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

బయటకు రావొద్దు
విజయనగరం, శ్రీకాకుళం, పల్నాడు, తూర్పుగోదావరి, అనకాపల్లి, గుంటూరు, కాకినాడ, పార్వతీపురం మన్యం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం, ఎన్టీఆర్, విశాఖపట్టణం, తిరుపతి, బాపట్ల, పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని 46 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొంది. నిన్న కూడా 88 మండలాల్లో వడగాలులు వీచినట్టు పేర్కొంది. ప్రజలు వీలైనంత వరకు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉత్తర కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ తెలిపింది.


More Telugu News