ఎవరిపని వాళ్లు చేస్తేనే బాగుంటుంది: సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్

  • మధురగీతాలను అందించిన మాధవపెద్ది సురేశ్
  • ఒక్కో పాటను ఒక్కొక్కరితో రాయించడం సరికాదని వెల్లడి
  • ట్యూన్ లో రైటర్స్ ను బంధించడం కరెక్ట్ కాదని వ్యాఖ్య 
  • ట్రెండ్ అనేది ఒట్టిమాట అంటూ అసహనం

మాధవపెద్ది సురేశ్ పేరు వినగానే 'బృందావనం' .. 'భైరవద్వీపం' .. 'శ్రీకృష్ణార్జున విజయం'వంటి సినిమాలలోని మధురమైన పాటలు మనసు తలుపు తడతాయి .. మకరందాన్ని విరజిమ్ముతాయి. మెలోడీ గీతాలతో తనదైన ముద్రవేసిన మాధవపెద్ది సురేశ్, తాజాగా ఎన్టీవీ ఎంటర్టైన్ మెంట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ కాలం పాటల గురించిన విషయాలను పంచుకున్నారు. 

" సినిమాల సంగీతం విషయంలో ఒక్కో తరంలో ఒక్కో గొప్ప కాంబినేషన్ ను చూస్తూ వస్తున్నాము. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఒక్కో పాటను ఒక్కో రైటర్ తో రాయిస్తున్నారు. కథ మొత్తం ఒక రైటర్ కి చెప్పి అతనితో అన్ని పాటలు రాయించడమే కరెక్ట్. పాత కాలం నుంచి చంద్రబోస్ వరకూ అదే పద్ధతి కొనసాగుతూ వచ్చింది.  రైటర్ ను ట్యూన్ లో బంధించి రాయమనడం కూడా కరెక్టు కాదనేది నా ఉద్దేశం" అని అన్నారు. 

'' ఎప్పుడైనా సరే ఎవరిపని వాళ్లు చేస్తేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఈ విషయంలో అందరూ నాతో ఏకీభవించాలని నేను అనుకోవడం లేదు. నిర్మాతలు మొత్తంగా మాట్లాడేసుకుని చేతులు దులిపేసుకుంటున్నారు. అందువల్లనే ఇలా జరుగుతోంది. ఏమైనా అంటే ట్రెండ్ అంటున్నారు .. అది ఒట్టిమాట అనేది నా ఉద్దేశం. ఇప్పటికీ మనం పాత సినిమాలు చూస్తున్నాం .. పాత పాటలు వింటున్నాం ఎందుకనేది అర్థం చేసుకుంటే చాలు" అని చెప్పారు.


More Telugu News