కవిత విచారణకు సహకరించలేదు... తప్పుదోవ పట్టించేలా సమాధానాలు చెప్పారు: సీబీఐ

  • కస్టడీకి సంబంధించి 11 పేజీలతో రిమాండ్ అప్లికేషన్ దాఖలు చేసిన సీబీఐ
  • శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ.14 కోట్ల వ్యవహారంపై కవితను ప్రశ్నించినట్లు వెల్లడి
  • దర్యాఫ్తును, సాక్షులను ప్రభావితం చేయగలిన, పలుకుబడి గల వ్యక్తి కవిత అని పేర్కొన్న సీబీఐ
  • కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందన్న సీబీఐ
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తమకు కస్టడీలో సహకరించలేదని, ఉద్దేశ్యపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా సమాధానాలు చెప్పారని సీబీఐ పేర్కొంది. మూడు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకొని విచారించిన సీబీఐ అధికారులు సోమవారం ఆమెను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ప్రవేశ పెట్టారు. 11 పేజీలతో రిమాండ్ అప్లికేషన్‌ను దాఖలు చేశారు. ఇందులో కీలక అంశాలను వెల్లడించారు. శరత్ చంద్రారెడ్డి నుంచి తీసుకున్న రూ.14 కోట్ల వ్యవహారంపై కవితను ప్రశ్నించినట్లు అందులో పేర్కొన్నారు.

శరత్ చంద్రారెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, విజయ్ నాయర్‌తో జరిగిన సమావేశాలపై కస్టడీ సందర్భంగా ప్రశ్నించామని, వాటికి కవిత సూటిగా సమాధానాలు చెప్పలేదన్నారు. ఆమె దర్యాఫ్తును, సాక్షులను ప్రభావితం చేయగలిన, పలుకుబడి గల వ్యక్తి అని అందులో పేర్కొన్నారు. కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందన్నారు. డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉందని, ఈ పరిస్థితుల్లో ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని కోరింది. కోర్టు ఆమెకు 9 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించింది.


More Telugu News