కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడమేంటి?.. కవితకు కోర్టు వార్నింగ్

  • మరోసారి ఇలా చేయొద్దని వార్నింగ్ ఇచ్చినా వినిపించుకోని ఎమ్మెల్సీ
  • కోర్టు హాల్ నుంచి బయటికొస్తూ మరోసారి మీడియాతో మాట్లాడిన కవిత
  • ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీని విధించిన రౌస్ ఎవెన్యూ కోర్టు
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో జైలుపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు సోమవారం వార్నింగ్ ఇచ్చింది. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే బదులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. మరోసారి ఇలా చేయొద్దంటూ రౌస్ ఎవెన్యూ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా హెచ్చరించారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కోర్టు నుంచి కవితను అధికారులు తీహార్ జైలుకు తరలించారు.

ఈ సందర్భంగా కవిత మళ్లీ మీడియాతో మాట్లాడారు. న్యాయమూర్తి హెచ్చరికలను పెడచెవిన పెట్టి మీడియాతో మాట్లాడారు. ఇది సీబీఐ కస్టడీ కాదని, బీజేపీ కస్టడీ అని వ్యాఖ్యానించారు. ‘ఇది సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ. రెండు నెలల నుంచి అడిగిందే అడుగుతున్నారు. బయట బీజేపీ అడిగిందే.. లోపల సీబీఐ అడుగుతోంది. ఇందులో కొత్తది ఏమీ లేదు’ అని కవిత ఆరోపించారు. మధ్యంతర బెయిల్ కోసం కవిత పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది. రెగ్యులర్ బెయిల్ పై దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు ఈ నెల 16న విచారించనుంది.


More Telugu News