రైళ్ల టాయిలెట్లలో దుర్గంధాన్ని గుర్తించే సెన్సర్లు.. రైల్వే శాఖ కొత్త ఆలోచన

  • అపరిశుభ్ర, దుర్గంధ భూయిష్ట టాయిలెట్లతో ప్రయాణికుల ఇబ్బందులు
  • సమస్య పరిష్కారానికి ఐఓటీ టెక్నాలజీ వినియోగించనున్న రైల్వే శాఖ
  • ముంబైకి చెందిన సంస్థతో పైలట్ ప్రాజెక్టుకు రూపకల్పన 
  • సెన్సర్లతో ఎప్పటికప్పుడు దుర్గంధాన్ని గుర్తించి సిబ్బందితో శుభ్రం చేయించనున్న రైల్వే
దేశంలో రైల్వే ప్రయాణికులను ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్య దూర్గంధభూయిష్ట, అపరిశుభ్ర టాయిలెట్లు. సమస్య పరిష్కారానికి రైల్వే శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకపోవడంతో ప్రయాణికుల ఫిర్యాదులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు రైల్వే శాఖ అత్యాధునిక ఐఓటీ సాంకేతికతను (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) వినియోగించే యోచనలో ఉంది. ఈ దిశగా రైల్వే బోర్డు కీలక ప్రతిపాదనలు చేసింది. 

జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఈ సాంకేతికను రైల్వో బోర్డు ప్రయోగాత్మకంగా కొన్ని కోచ్‌లల్లో పరీక్షించనుంది. ఈ పైలట్ ప్రాజెక్టును అమలు పరిచేందుకు రైల్వే బోర్డు.. ముంబైకి చెందిన విలిసో టెక్నాలజీస్‌ సంస్థను ఎంపిక చేసింది. ప్రాజెక్టులో భాగంగా ఎంపిక చేసిన కొన్ని కోచ్‌లల్లోని బాత్రూమ్‌లలో ప్రత్యేక డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. బాత్రూమ్‌లల్లో దుర్గంధానికి కారణమయ్యే వాయువులను ఇవి గుర్తిస్తాయి. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ ద్వారా ఓ సెంట్రల్ హబ్‌కు చేరవేస్తాయి. ఈ సమాచారం ఆధారంగా పారిశుద్ధ్య సిబ్బంది.. అపరిశుభ్ర టాయిలెట్ల సమాచారం అందిన వెంటనే వెళ్లి సమస్య పరిష్కరిస్తారు. సంబంధిత సిబ్బందికి మొబైల్ యాప్, వెబ్ యాప్ ద్వారా ఈ సమాచారం అందుతుందని విలిసో టెక్నాలజీస్ పేర్కొంది.


More Telugu News