గుర్తు తెలియ‌ని వ్య‌క్తుల‌కు థ్యాంక్స్‌.. స‌ర‌బ్‌జీత్‌కు న్యాయం జ‌రిగింది: ర‌ణ‌దీప్ హుడా

  • గూఢచర్యం ఆరోపణలపై 23 ఏళ్లపాటు పాక్ జైలులో మగ్గిపోయిన సరబ్‌జీత్‌
  • 2013లో జైలులోనే ఆయనపై ఇటుకలతో ఆమిర్ సర్ఫరాజ్ దాడి
  • తాజాగా లాహోర్‌లో సర్ఫరాజ్‌ను కాల్చి చంపిన‌ గుర్తుతెలియని వ్యక్తులు
  • ఆమిర్ మృతిపై ర‌ణ‌దీప్ హుడా ట్వీట్‌
  •  'ఇండియా టూడే'లో వ‌చ్చిన వార్త తాలూకు పేప‌ర్ క్లిప్‌ను ట్వీట్‌కు జోడించిన వైనం 
  • అమ‌రుడు సరబ్‌జీత్‌కు కొంత న్యాయం జ‌రిగిందంటూ వ్యాఖ్య‌
గూఢచర్యం ఆరోపణలపై భారత్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన సరబ్‌జీత్‌సింగ్ (49) ను దాయాది పాకిస్థాన్ 1990లో అదుపులోకి తీసుకుని లాహోర్‌లోని కోట్‌లక్పత్ జైలులో ఖైదు చేసింది. ఈ జైలులో ఉన్న స‌మ‌యంలోనే సరబ్‌జీత్‌పై దాడిచేసి అత‌ని మృతికి కార‌ణ‌మైన‌ అండర్ వరల్డ్ డాన్ ఆమిర్ సర్ఫరాజ్ తాజాగా దారుణ హత్యకు గురయ్యాడు. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిని తుపాకితో కాల్చి చంపిన విష‌యం తెలిసిందే. ఈ విష‌య‌మై బాలీవుడ్ న‌టుడు ర‌ణ‌దీప్ హుడా 'ఎక్స్' (ట్విట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. ఆమిర్‌ను చంపినవారికి హుడా ధ‌న్య‌వాదాలు తెలిపారు. 

"గుర్తుతెలియ‌ని వ్య‌క్తులకు థ్యాంక్యూ. నా సోదరి దల్బీర్ కౌర్‌, స్వపన్‌దీప్, పూనమ్‌లను ఎప్ప‌టికీ ప్రేమిస్తూనే ఉంటాను. నేడు అమ‌రుడు సరబ్‌జీత్‌కు కొంత న్యాయం జ‌రిగింది" అని ట్వీట్ చేశాడు. దీనికి 'ఇండియా టూడే'లో వ‌చ్చిన వార్త తాలూకు పేప‌ర్ క్లిప్‌ను జోడించారు. కాగా, సరబ్‌జీత్‌సింగ్ బ‌యోపిక్‌లో ర‌ణ‌దీప్ హుడా న‌టించిన సంగ‌తి తెలిసిందే. సరబ్‌జీత్ సోద‌రి ద‌ల్బీర్ కౌర్‌ పాత్రలో ఐశ్వ‌ర్య‌రాయ్ న‌టించారు.     

ఇదిలాఉంటే.. గూఢచర్యం ఆరోపణలపై 1990లో పాకిస్థాన్ అధికారులు సరబ్‌జీత్‌సింగ్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై వచ్చిన ఆరోపణలను భారత ప్రభుత్వం తోసిపుచ్చినప్పటికీ 23 ఏళ్లపాటు ఆయన జైలులోనే మగ్గిపోయాడు. అఫ్జల్‌గురును భారత్‌లో ఉరి తీసిన తర్వాత మే 2013లో లాహోర్‌లోని కోట్‌లక్పత్ జైలులో ఉన్న సరబ్‌జీత్‌పై అదే జైలులో ఉన్న సర్ఫరాజ్ మరికొందరు ఖైదీలతో కలిసి ఇటుకలతో దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డిన‌ ఆయనను లాహోర్‌లోని జిన్నా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సరబ్‌జీత్ గుండెపోటుతో మరణించాడు. తాజాగా, సర్ఫరాజ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు తుపాకితో కాల్చి చంపారు.


More Telugu News