శివమ్ దూబే, రుతురాజ్ ఫిఫ్టీలు... ఆఖరి ఓవర్లో ధోనీ ఫైర్

  • వాంఖెడే స్టేడియంలో ముంబయి వర్సెస్ చెన్నై
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై
  • 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు
  • 4 బంతుల్లో 20 పరుగులు చేసిన ధోనీ
  • హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్సులు
ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. వాంఖెడే స్టేడియంలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే... నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది.

కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే అర్ధసెంచరీలతో అదరగొట్టడం ఒకెత్తయితే, ధోనీ ఆఖర్లో వచ్చి 4 బంతుల్లో 20 పరుగులు చేయడం మరో ఎత్తు. ఇన్నింగ్స్ చివరి ఓవర్ ను హార్దిక్ పాండ్యా విసరగా, ధోనీ హ్యాట్రిక్ సిక్సులు కొట్టడం విశేషం. తద్వారా తనలో చేవ తగ్గలేదని ఘనంగా చాటాడు. 

అంతకుముందు, రుతురాజ్ గైక్వాడ్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 69 పరుగులు చేశాడు. శివమ్ దూబే 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సులతో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓపెనర్లు అజింక్యా రహానే 5, రచిన్ రవీంద్ర 21 పరుగులు చేశారు. డారిల్ మిచెల్ 17 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో అవుటయ్యాడు. మిచెల్ వికెట్ తీసిన ఆనందాన్ని ధోనీ ఆవిరి చేశాడు. పాండ్యా బౌలింగ్ ను చీల్చిచెండాడాడు. దాంతో చెన్నై స్కోరు 200 దాటింది. 

ముంబయి బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2, గెరాల్డ్ కోట్జీ 1, శ్రేయాస్ గోపాల్ 1 వికెట్ తీశారు. 

అనంతరం, 207 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబయి ఇండియన్స్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు అజేయంగా 6 ఓవర్లలో 63 పరుగులు జోడించారు. రోహిత్ శర్మ 42, ఇషాన్ కిషన్ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.


More Telugu News