కావాలని దాడి చేయించుకుని కళ్లు పోగొట్టుకుంటామా?: వెల్లంపల్లి

  • నిన్న విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి
  • ఈ దాడిలో వెల్లంపల్లి కంటికి కూడా గాయం
  • టీడీపీ నేతల సానుభూతి తమకు అవసరం లేదన్న వెల్లంపల్లి
  • రాజకీయాలు చేయకుండా ఉంటే చాలని వ్యాఖ్యలు
సీఎం జగన్ పై విజయవాడలో జరిగిన రాయి దాడిలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా గాయపడ్డారు. ఈ దాడి ఘటనపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. తాము కావాలనే దాడి చేయించుకున్నామని అంటున్నారని, కావాలని దాడి చేయించుకుని కళ్లు పోగొట్టుకుంటామా? అని మండిపడ్డారు. 

ఈ సమయంలో టీడీపీ నేతల సానుభూతి తమకు అవసరం లేదని, వారు ఈ ఘటనపై రాజకీయాలు చేయకుండా ఉంటే చాలని అన్నారు. సీఎంకు నుదుటిపై కాకుండా మరో చోట రాయి తగిలితే పరిస్థితి ఏంటని వెల్లంపల్లి ప్రశ్నించారు. 

ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరిపితే చంద్రబాబు బండారం వెల్లడవుతుందని అన్నారు. నిన్నటి దాడి ఘటన చూస్తుంటే సీఎంను అంతమొందించే కుట్రలాగా అనిపిస్తోందని, ఈ నేపథ్యంలో, సీఎం జగన్ కు భద్రత పెంచాల్సిన అవసరం ఉందని వెల్లంపల్లి పేర్కొన్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన వెల్లంపల్లి

రాయి దాడి ఘటనలో తన కంటికి కూడా గాయమైందని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. తన కనుగుడ్డుపై గీతలు పడ్డాయని, భద్రతా సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించారని చెప్పారు. తదుపరి చికిత్స తీసుకుంటానని తెలిపారు. ఈ ఘటనపై విజయవాడ సింగ్ నగర్ పోలీసులకు వెల్లంపల్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు సెక్షన్ 307 కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.


More Telugu News