లండన్ లో జనాలను పరేషాన్ చేస్తున్న పక్షి.. వీడియో ఇదిగో!

  • కొమ్మల్లో నక్కి పోలీస్ సైరన్ లా కూత
  • థేమ్స్ వ్యాలీ వాహనదారుల్లో గందరగోళం
  • తికమకపడుతున్న పోలీసులు
రహదారి పక్కనే ఉన్న చెట్టుపై తీరిగ్గా వాలిన పక్షి ఒకటి లండన్ వాసులను గందరగోళానికి గురిచేస్తోంది. కొమ్మల్లో దాక్కుని పోలీస్ సైరన్ ను ఇమిటేట్ చేస్తూ పరేషాన్ చేస్తోంది. పోలీసులు వెంటాడుతున్నారని వాహనదారులు.. తమ వాహనానికి ఏమైందోనని పోలీసులు టెన్షన్ పడుతున్నారు. థేమ్స్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పక్కన ఈ ఘటన చోటుచేసుకుంది. వర్క్ బిజీలో పోలీసులు, వాహనాల్లో వెళుతున్న జనాలను ఈ పక్షికూత కంగారు పెట్టింది. తీరా వాహనాన్ని పక్కనే ఆపి చూస్తే పోలీసులు ఎక్కడా కనిపించలేదు. మరి సైరెన్ ఎక్కడి నుంచి వస్తోందని జాగ్రత్తగా వెతకగా.. పక్కనే ఉన్న ఓ చెట్టు కొమ్మల నుంచి వస్తోందని, ఇదంతా ఓ తుంటరి పక్షి నిర్వాకమని గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. థేమ్స్ వ్యాలీలోని పోలీస్ స్టేషన్ పక్కనే రహదారి ఉంది. దానిపక్కనే ఉన్న చెట్టుపై ఓ పక్షి ఉంటోంది. కొంతకాలంగా అక్కడే ఉండడంతో పోలీస్ వాహనాలు చేసే సైరెన్ శబ్దాలను నిత్యం వింటోంది. తాజాగా సైరెన్ ను అనుకరిస్తూ కూత పెట్టడం మొదలుపెట్టింది. ఈ కూతతో అటు వాహనదారులు, ఇటు పోలీసులు తమ వాహనాలను ఆపి చెక్ చేసుకుంటున్నారు. కాగా, ఈ పక్షి ఫ్లయింగ్ స్క్వాడ్ లో భాగమేమోనని, పోలీసులే దానికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారేమోనని వాహనదారులు భావిస్తుండడం కొసమెరుపు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


More Telugu News