మరో నాలుగు రోజుల్లో సంచలనం జరగబోతోందంటూ ట్వీట్.. దీని మర్మమేంటో సీబీఐ తేల్చాలంటూ అయ్యన్నపాత్రుడి డిమాండ్

  • మార్కెటింగ్ కన్సల్టెంట్ చేసిన పోస్ట్ ను షేర్ చేసిన అయ్యన్నపాత్రుడు
  • చంద్రబాబు అరెస్ట్‌కు ముందు కూడా ఇలాంటి పోస్టే చేశారన్న అయ్యన్నపాత్రుడు
  • గతంలో న్యాయమూర్తులను దూషించింది కూడా ఆయనేనన్న అయ్యన్న
  • తనకు సంబంధం లేదన్న శ్రీధర్‌రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన రాయి దాడిపై టీడీపీ సీనియర్ నేత అయ్యనపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఎక్స్ ద్వారా ఓ పోస్టును షేర్ చేశారు. ఇప్పుడా పోస్టు వైరల్ అవుతోంది. మార్కెటింగ్ కన్సల్టెంట్ అవుతు శ్రీధర్‌రెడ్డి సీఎం జగన్‌‌ను కలిసిన ఫొటోతోపాటు కింద రాయిదాడిలో గాయమైన జగన్ ఫొటోలు కూడా ఉన్నాయి. ఆ ఫొటోలో పైన నాలుగు రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికల మూడ్‌ను మార్చేసే ఘటన జరగబోతోందని కామెంట్ ఉంది.

ఏప్రిల్ 12న పోస్టు అయిన ఈ ఫొటోను షేర్ చేసిన అయ్యన్నపాత్రుడు.. హైకోర్టు న్యాయమూర్తులను దూషించిన కేసులో ప్రధాన నిందితుడైన జగన్ సన్నిహితుడు గతంలోనూ పలుమార్లు ఇలాంటి పోస్టులు చేశాడని గుర్తుచేశారు. చంద్రబాబు అరెస్టు సందర్భంగా కూడా సంచలనం జరగబోతుందని ట్వీట్ చేశాడని పేర్కొన్నారు. మళ్లీ ఇప్పుడు కూడా అలాంటిదే చేశాడని,  దీని వెనక మర్మమేంటనేది సీబీఐ తేల్చాలని డిమాండ్ చేశారు. 

వైరల్ అవుతున్న ఈ పోస్టుపై శ్రీధర్‌రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ పోస్టును తాను పెట్టినట్టు టీడీపీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపిస్తున్నారని, దీనిపై ఏపీ డీజీపీ సమగ్ర విచారణ జరిపించాలని కోరుకుంటునట్టు పేర్కొన్నారు.


More Telugu News