సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనపై స్పందించిన జనసేన నేత నాగబాబు

  • సీఎం జగన్‌పై దాడిని అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించిన జనసేన ప్రధాన కార్యదర్శి
  • రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శలుండచ్చు.. కానీ ఇలాంటి భౌతిక దాడులు హేయమని వ్యాఖ్య
  • నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న నాగబాబు
ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై శనివారం రాత్రి విజయవాడలో జరిగిన రాయి దాడి ఘటనపై పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు స్పందించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన దాడిని అప్రజాస్వామిక చర్య అని ఆయన అభివర్ణించారు. జనసేన ప్రధాన కార్యదర్శిగా తాను ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శలుండచ్చు కానీ ఇలా భౌతికంగా దాడి చేయడం హేయమైన చర్య అని, చట్టరీత్యా నేరమని నాగబాబు అన్నారు. పోలీసులు ఈ దాడికి పాల్పడిన దుండగులకు కఠిన శిక్ష వేయాలని, మరోసారి ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని కోరుతున్నానని అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు.

కాగా ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో శనివారం రాత్రి దాడి జరిగింది. అసెంబ్లీ ఎన్నికలు 2024లో భాగంగా ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ఉండగా సింగ్ నగర్ వద్ద ఓ ఆగంతుకుడు రాయి విసిరాడు. దీంతో ఆయన ఎడమ కంటి పైభాగంలో స్వల్ప గాయమైంది. వెంటనే స్పందించిన వ్యక్తిగత వైద్య సిబ్బంది సీఎం జగన్‌కు బస్సులోనే చికిత్స అందించారు. అనంతరం డాక్టర్ల సూచన మేరకు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఆయన చేరారు.


More Telugu News