గేమర్లతో ప్రధాని మోదీ సమావేశం... ఆన్‌లైన్ గేమింగ్ 'నూబ్'తో ప్రతిపక్షాలకు చురక

  • ఆన్‌లైన్ గేమర్లతో ప్రధాని మోదీ సమావేశం
  • నేను 'నూబ్' పదాన్ని ఉపయోగిస్తే ఎవరిని అంటున్నానా? అని ప్రజలు ఆశ్చర్యపోతారన్న మోదీ
  • నేను ఈ పదాన్ని వాడితే మీరంతా ఓ వ్యక్తిని ఊహించుకుంటారన్న మోదీ
  • గేమింగ్ పరిభాషలో 'నూబ్' అంటే నైపుణ్యం లేనివారని అర్థం
  • స్పష్టంగా ఎవరి పేరును ప్రస్తావించని ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్రమోదీ ఆన్‌లైన్ గేమింగ్ పరిభాషలో వాడే 'నూబ్' పదాన్ని తన ప్రత్యర్థులపై పరోక్షంగా ఉపయోగించారు. ఆయన పలువురు గేమర్లతో ఇటీవల సమావేశమయ్యారు. వివిధ రాష్ట్రాలకు చెందిన గేమర్లు తీర్థ్ మెహతా, పాయల్ ధరే, అనిమేశ్ అగర్వాల్, అన్షు బిష్త్, నమన్ మధుర్, మిథిలేష్ పటాంకర్, గణేశ్ గంగాధర్ తదితరులు ఇటీవల ప్రధాని నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారితో కలిసి కాసేపు ఆన్‌లైన్ గేమ్ ఆడారు. ఈ సమయంలో వారి మధ్య 'నూబ్' అనే పదం వినిపించింది. 'నూబ్' అంటే గేమింగ్ పరిభాషలో ఆటకు కొత్తగా వచ్చిన వారు లేక నైపుణ్యం లేని వ్యక్తి అని అర్థం.

ఈ పదం వినిపించగానే ప్రధాని ముసిముసి నవ్వులు నవ్వారు. ఇదే సమయంలో, 'ఎన్నికల సమయంలో నేను ఈ పదాన్ని ఉపయోగిస్తే ఎవరిని అంటున్నానా? అని ప్రజలు ఆశ్చర్యపోతారు. నేను ఈ పదాన్ని వాడితే కనుక మీరు ఓ వ్యక్తిని అన్నట్లుగా ఊహించుకుంటారు' అని ప్రధాని మోదీ వారితో వ్యాఖ్యానించారు. అయితే ప్రధాని మోదీ మాత్రం స్పష్టంగా ఎవరి పేరునూ తీసుకోలేదు.

కానీ ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఎన్నికల సమయంలో బీజేపీ ఇలాంటి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత ప్రమోద్ తివారీ విమర్శించారు. దీనిపై బీజేపీ కూడా వెంటనే స్పందించింది. ప్రధాని మోదీ ఎవరి పేరు తీసుకోనప్పటికీ కాంగ్రెస్ ఎందుకు స్పందిస్తోందని బీజేపీ నేత షెహజాద్ పునావాలా కౌంటర్ ఇచ్చారు. అంటే రాజకీయాల్లో 'నూబ్' ఎవరో కాంగ్రెస్ వాళ్లే చెబుతున్నారన్నారు.


More Telugu News