తులసివనం వంటి తిరుపతిని గంజాయి వనం చేశారు: పవన్ కల్యాణ్

  • తిరుపతిలో ఇవాళ బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ సమావేశం
  • ఎన్నికల్లో కూటమి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
  • తిరుమల క్షేత్రానికి ఉన్న పవిత్రతను వైసీపీ మంటగలిపింది అంటూ ఆగ్రహం
జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ తిరుపతిలో బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీలు అనుసరించాల్సి వ్యూహాలు గురించి చర్చించారు. తిరుపతి అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల గురించి చర్చించారు. మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

ఈ సందర్భంగా ఆయన తిరుపతి-తిరుమల గురించి మాట్లాడారు. తిరుమల క్షేత్రానికి ఉన్న పవిత్రతను వైసీపీ ప్రభుత్వం, వారు ఏరికోరి నియమించుకున్న అధికారులు మంటగలిపిన తీరు శ్రీవారి భక్తులను మనోవేదనకు గురిచేసిందని అన్నారు. టీటీడీ నిధులను సైతం మళ్లించే కుట్రలకు తెరదీశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో కచ్చితంగా ధర్మ పరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

తులసివనం వంటి తిరుపతిని గంజాయి వనంగా మార్చేశారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి నియోజకవర్గంలో వైసీపీ ముఠాలు చేస్తున్న అరాచకాలను అడ్డుకోగలిగేది జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి మాత్రమేనని స్పష్టం చేశారు.


More Telugu News