దానంను మేం కబ్జా చేయనివ్వలేదు.. కాంగ్రెస్ లో చేరి దర్జాగా కాజేశాడు: కేటీఆర్

  • దానం నాగేందర్ భూకబ్జాపై మండిపడ్డ మాజీ మంత్రి
  • రూ.20 కోట్ల విలువైన భూమిని కాజేశాడని ఫైర్
  • పార్టీ మారడానికి అది రేవంత్ ఇచ్చిన నజరానా అంటూ వ్యాఖ్య
ఖైరతాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ నేత దానం నాగేందర్ పై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. నాలా స్థలాన్ని కబ్జా చేసిన దానం నాగేందర్ కూడా బీఆర్ఎస్ పై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. తమ పార్టీలో ఉన్నన్ని రోజులు ఆ భూమిని దానం నుంచి కాపాడామని, కబ్జా చేయకుండా నిలువరించామని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ తెలిపారు. దానం నాగేందర్ ఇంటి వెనక ఉన్న 700 గజాల స్థలం ముందు బీఆర్ఎస్ హయాంలో ‘ప్రభుత్వ భూమి’ అని బోర్డు ఉందని గుర్తుచేశారు. పార్టీ మారిన వెంటనే దానం నాగేందర్ ఆ బోర్డును పీకేసి స్థలాన్ని కబ్జా చేశాడని ఆరోపించారు.

దీనికి సంబంధించిన వీడియో క్లిప్పులు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్ లో చేరడానికి సీఎం రేవంత్ రెడ్డి ఆ భూమిని దానం నాగేందర్ కు నజరానాగా ఇచ్చాడని కేటీఆర్ ఆరోపించారు. అలాంటి వ్యక్తి మాట్లాడిన మాటలను, చేసిన ఆరోపణలను కూడా మీడియా హైలెట్ చేయడం దురదృష్టకరమని విమర్శించారు. ఆయనేదో సత్య హరిశ్చంద్రుడు అన్నట్లుగా చూపిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారాలని అనుకునే వారు ఏదో ఒక కారణం వెతుక్కుంటారని కేటీఆర్ చెప్పారు.



More Telugu News