వాలంటీర్లంద‌రూ వైసీపీ కార్య‌క‌ర్త‌లే.. వారితో రాజీనామా చేయించి ఎన్నిక‌ల్లో పాల్గొనేలా చూడాలి: మంత్రి ధ‌ర్మాన

  • వాలంటీర్లు కార్య‌క‌ర్త‌ల్లా ప‌ని చేస్తారన్న వైసీపీ నేత‌
  • అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వారికి ఏం చేయాలో చూద్దామ‌ని వ్యాఖ్య‌
  • రాజీనామా చేసిన వాలంటీర్లు 50 ఇళ్ల నుంచి 25 మందిని నామినేష‌న్ ప్ర‌క్రియ‌కు తీసుకురావాల‌ని చెప్పాల‌న్న మంత్రి  
'వాలంటీర్లంద‌రూ వైసీపీ కార్య‌క‌ర్త‌లే. వారితో రాజీనామా చేయించి ఎన్నిక‌ల్లో పాల్గొనేలా నేత‌లు చూడాలి' అని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వారికి ఏం చేయాలో చూద్దామ‌ని పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలో నిర్వ‌హించిన వైసీపీ విస్తృత స్థాయి స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

"ఎన్నిక‌ల్లో వాలంటీర్లు పాల్గొనేలా చూడండి. కేసులు అడ్డువ‌స్తాయ‌నుకుంటే వారిని రాజీనామా చేయించండి. కార్య‌క‌ర్త‌ల్లా ప‌ని చేస్తారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వారికి ఏం చేయాలో చూద్దాం. ఒక సామాన్య‌మైన ఓట‌రు ఎవ‌రో ఒక‌రు అడ‌గాలి క‌దా అనుకుంటాడు. మ‌నం ఇప్పుడే క‌దా వారికి క‌నిపించేది. మ‌ళ్లీ ఐదేళ్ల త‌ర్వాత క‌నిపిస్తాం. రాజీనామా చేసిన వాలంటీర్లు 50 ఇళ్ల నుంచి 25 మందిని నామినేష‌న్ ప్ర‌క్రియ‌కు తీసుకురావాల‌ని చెప్పండి. ఎన్నిక‌ల్లో పోల్ మేనేజ్‌మెంట్ చేసే వారే ఇబ్బందిక‌రంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ విజ‌యం సాధిస్తారు" అని మంత్రి ధ‌ర్మాన చెప్పుకొచ్చారు. 

అలాగే వైసీపీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ స‌మ‌న్వ‌య‌క‌ర్త వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, స‌చివాల‌య ఇన్‌ఛార్జి ఆధ్వ‌ర్యంలో 85 సంవ‌త్స‌రాల వృద్ధులు, దివ్యాంగులను గుర్తించి వారితో ఓటు వేయించేలా చూడాల‌ని పేర్కొన్నారు.


More Telugu News