ధాన్యం కొనుగోలు, నీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

  • కృత్రిమ నీటి కొరతను సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • ధాన్యం కొనుగోలులో తరుగు తీస్తే వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశం
  • ధాన్యం పక్కదారి పట్టించే మిల్లర్లపై నిఘా పెట్టాలని సూచన
  • ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టాలని రైతులకు విజ్ఞప్తి
ధాన్యం కొనుగోలు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ధాన్యం కొనుగోలు, పలుప్రాంతాల్లో నీటి సరఫరా ఇబ్బందులు తన దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. కృత్రిమ నీటి కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఉద్దేశ్యపూర్వకంగా గేటెడ్ కమ్యూనిటీలకు ఎక్కువ నీరు, బస్తీలకు తక్కువ నీటిని విడుదల చేసే సిబ్బందిపై నిఘా పెట్టాలన్నారు. అలాగే ధాన్యం కొనుగోలులో తరుగు తీస్తే వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం పక్కదారి పట్టించే మిల్లర్లపై నిఘా పెట్టాలన్నారు. ఎంఎస్‌పీ (కనీస మద్దతు ధర) కంటే తక్కువకు కొనుగోలు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు.

శుక్రవారం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయాలన్నారు. వారికి కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు తమ పరిధిలోని మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలన్నారు.

కొన్నిచోట్ల తేమ ఎక్కువగా ఉందని వ్యాపారులు, మిల్లర్లు ధరల్లో కోత పెడుతున్నారని.. తమ దృష్టికి వచ్చిందన్నారు. కాబట్టి రైతులు కూడా ధాన్యాన్ని మార్కెట్లకు తెచ్చే ముందు ఆరబెట్టాలని సూచించారు. కల్లాల నుంచి నేరుగా మార్కెట్‌కు తరలిస్తే తేమ శాతం ఎక్కువగా ఉంటుందని... కాబట్టి ధాన్యం ఆరబెట్టేందుకు మార్కెట్ యార్డులోనే తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మార్కెట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. 

తాగునీటి సరఫరా కోసం ఉమ్మడి జిల్లాలకు నియమించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు ధాన్యం కొనుగోళ్లను కూడా పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల సమయం కావడంతో ఉద్దేశ్యపూర్వకంగా వచ్చే ఫిర్యాదులపై దృష్టి సారించాలన్నారు. అన్ని పట్టణాలు, నగరాల్లో నీటి సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. ఎండాకాలం దృష్ట్యా నీటి సరఫరాపై దృష్టి సారించాలన్నారు. ఫిర్యాదులు వస్తే తాగునీటి సరఫరాను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు.


More Telugu News