మరో రెండు నెలల్లో టెస్లా వస్తుందన్న నమ్మకంతో ఎదురుచూస్తుంటాం: నారా లోకేశ్

  • త్వరలో భారత్ లో పర్యటించనున్న ఎలాన్ మస్క్
  • టెస్లా కోసం రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ
  • మస్క్ గతంలో చంద్రబాబును కలిశాడని గుర్తు చేసిన నారా లోకేశ్
  • ఏపీకి టెస్లా వస్తోందంటూ ఇదే తరహా ప్రకటన చేసిన వైసీపీ
ప్రపంచస్థాయి విద్యుత్ వాహనాల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ త్వరలో భారత్ లో పర్యటించనున్నారు. సుదీర్ఘకాలంగా భారత్ లో టెస్లా రంగప్రవేశం కోసం ఎదురుచూస్తున్న ఎలాన్ మస్క్... తమ సంస్థకు భారత కేంద్ర ప్రభుత్వం భారీగా రాయితీలు ఇవ్వాలని ఆశిస్తున్నారు. ఈసారి తన కోరిక నెరవేరుతుందని మస్క్ భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ఆయన భారత్ పర్యటన అత్యంత ప్రాధాన్యతా అంశంగా మారింది. భారత్ లో టెస్లా పరిశ్రమ స్థాపన ఈసారి దాదాపు ఖాయంగా కనిపిస్తుండగా, ఆ పరిశ్రమ కోసం రాష్ట్రాలు తీవ్రంగా పోటీ పడే పరిస్థితి నెలకొంది. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ అడుగు ముందుకేసి గతంలో ఎలాన్ మస్క్.... నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన అంశాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

"హాయ్ ఎలాన్ మస్క్... మీరు భారత్ పర్యటనకు వస్తున్నారని తెలిసింది... ఇది ఎంతో ఆనందం కలిగించే విషయం. 2017లో మీరు చంద్రబాబుతో సమావేశం అయిన సంగతిని ఇప్పుడే మా బృందానికి గుర్తుచేశాను. ఆ సమయంలో మీరు మా రాష్ట్రంలో పెట్టుబడికి చాలా ఆసక్తి చూపారు. నికార్సయిన నైపుణ్యం ఉన్న యువత, అపారమైన సహజవనరులతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు సరైన గమ్యస్థానం. మీ విద్యుత్ వాహన పరిశ్రమ స్థాపనకు మా రాష్ట్రం కచ్చితంగా వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఇప్పటి నుంచి మరో రెండు నెలల్లో టెస్లా వస్తుందన్న నమ్మకంతో ఎదురుచూస్తుంటాం" అంటూ లోకేశ్ సోషల్ మీడియాలో  పేర్కొన్నారు. అంతేకాదు, చంద్రబాబు, మస్క్ భేటీకి సంబంధించిన ఫొటో కూడా పంచుకున్నారు. 

అయితే, ఇదే తరహా ప్రకటనను వైసీపీ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఆంధ్రప్రదేశ్ కు టెస్లా అంటూ పేర్కొంది. ఎన్నికల తర్వాత టెస్లా బృందం రాష్ట్రంలో పర్యటించనుందని, ప్లాంట్ ఏర్పాటుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆహ్వానం పంపిందని తెలిపింది. టెస్లాకు అనువుగా ఏపీలో మౌలిక సదుపాయాలు ఉన్నాయని వైసీపీ తన పోస్టులో వివరించింది.



More Telugu News