నా కూతురు కావ్య ఇక్కడే పుట్టింది...: సోషల్ మీడియా ప్రచారంపై కడియం శ్రీహరి ఆగ్రహం

  • విపక్షాలు రాజ్యాంగంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని విమర్శ
  • ఎన్ని కుట్రలు, కుయుక్తులు చేసినా కావ్య గెలుస్తుందని ధీమా
  • తాను ఎవరికీ వెన్నుపోటు పొడవలేదన్న కడియం శ్రీహరి
తన కూతురు కావ్య ఇక్కడే పుట్టిందని, ఇక్కడే కడియం ఫౌండేషన్ ఏర్పాటుచేసి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కావ్యది గుంటూరు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కడియం స్పందించారు. శుక్రవారం స్టేషన్ ఘనపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విపక్షాలు రాజ్యాంగంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. వారు చేసిన పనులు చెప్పుకోవాలి కానీ, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారన్నారు. మతం మారినంత మాత్రాన కులం మారదని 2017లో ఐదుగురు జడ్జిల ధర్మాసనం చెప్పిందని, పిల్లలకు తండ్రి కులమే వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. కావాలని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తన కూతురు కావ్యపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఎన్ని కుట్రలు, ఎన్ని కుయుక్తులు చేసినా తన కూతురు కావ్య వరంగల్ నుంచి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు బీఆర్ఎస్ డబ్బులు ఇవ్వలేదని... అలా ఇచ్చినట్లు నిరూపిస్తే తాము పోటీ నుంచి తప్పుకుంటామని సవాల్ చేశారు. తాము రూ.10 కోట్లు తీసుకున్నామని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వాదంతో తాము వరంగల్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. తాను ఏ పార్టీకి వెన్నుపోటు పొడవలేదన్నారు.

కానీ తన ద్వారా ఎదిగిన ఆరూరి రమేశ్ మాత్రం తనకు వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఆరూరి రమేశ్ గెలుపు కోసం గతంలో ప్రచారం చేశానని కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఆయన భూకబ్జాల కారణంగానే ఓడిపోయారన్నారు. మంద కృష్ణ మాదిగ తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనది మాదిగ ఉపకులం అన్నారు. అసలు మాదిగలకు ద్రోహం చేస్తోంది మంద కృష్ణే అన్నారు.


More Telugu News