‘సింగం’ మూవీలో మెప్పించిన తమిళ ప్రముఖ నటుడు అరుళ్మణి కన్నుమూత

  • 65 ఏళ్ల వయసులో గుండెపోటుతో తుది శ్వాస విడిచిన నటుడు
  • అన్నాడీఎంకే పార్టీలో చేరి కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న అరుళ్మణి
  • లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత పది రోజులుగా విస్తృత ప్రచారం
  • విశ్రాంతి కోసం గురువారం చెన్నైలోని నివాసానికి వెళ్లి అస్వస్థతకు గురైన నటుడు
కోలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సూర్య నటించిన ‘సింగం’ సినిమాలో ప్రేక్షకుల్ని మెప్పించిన తమిళ ప్రముఖ నటుడు అరుళ్మణి మృతి చెందారు. 65 ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.‌ రజ‌నీకాంత్ నటించిన లింగ‌తో పాటు ప‌లు సినిమాల్లో ఆయన కీల‌క పాత్ర‌లు పోషించారు. అయితే రాజకీయాల్లో చేరిన ఆయన కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

అన్నాడీఎంకే పార్టీలో అరుళ్మణి క్రియాశీలకంగా  వ్యవహరిస్తూ వచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. పార్ల‌మెంట్ ఎన్నికల నేపథ్యంలో గ‌త ప‌ది రోజులుగా త‌మిళ‌నాడులోని ప‌లు ప్రాంతాల్లో విస్తృతంగా ప‌ర్యటించారు. అయితే విశ్రాంతి తీసుకునేందుకు గురువార‌మే ఆయన చెన్నైకి వెళ్లారు. విషాదకర రీతిలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించినప్పటికీ ఆయన ప్రాణాలు దక్కలేదు. గుండెపోటుతో అరుళ్మణి చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. గురువారమే ఆయన కన్నుమూశారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

కాగా సూర్య ప్రధాన పాత్రలో సూపర్ హిట్‌గా నిలిచిన సింగం, సింగం 2 సినిమాల్లో విల‌న్ గ్యాంగ్‌లో ఓ స‌భ్యుడిగా అరుళ్మణి నటించి మెప్పించారు. మరిన్ని సినిమాల్లోనూ ఆయన విలన్ క్యారెక్టర్లు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ నటుడు డేనియ‌ల్ బాలాజీ ఇటీవలే చనిపోయిన విషయం తెలిసిందే.


More Telugu News