కోర్టులో కవిత.. 5 రోజుల కస్టడీ కోరిన సీబీఐ!
- రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశ పెట్టిన సీబీఐ
- లిక్కర్ పాలసీ కేసులో కవితదే కీలక పాత్ర అన్న సీబీఐ అధికారులు
- కవిత వాట్సాప్ చాట్ ను కోర్టుకు అందించిన అధికారులు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అధికారులు హాజరు పరిచారు. కవితను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీబీఐ అధికారులు కోరారు. ఈ కేసులో కవిత కీలక పాత్రను పోషించారని వారు కోర్టుకు తెలిపారు. సౌత్ గ్రూప్, ఆప్ పార్టీ మధ్య జరిగిన రూ. 100 కోట్ల లావాదేవీల్లో కవితది ప్రధాన పాత్ర అని వారు చెప్పారు. కవితను లోతుగా విచారిస్తేనే వివరాలు బయటకు వస్తాయని తెలిపారు. కవిత వాట్సాప్ చాట్ వివరాలను కోర్టుకు సీబీఐ అధికారులు అందించారు. కోర్టులో ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. న్యాయమూర్తి కావేరి బవేజా వాదనలను వింటున్నారు. కవితను సీబీఐ కస్టడీకి కోర్టు ఇస్తుందా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.