ఫ్యామిలీ మెంబర్ స్పాన్సర్ వీసాకు ఆదాయ పరిమితిని 55 శాతం పెంచిన యూకే

  • ఫ్యామిలీ స్పాన్సర్ వీసా జారీని కఠినతరం చేసిన రిషి సునాక్ ప్రభుత్వం
  • కనీస ఆదాయ పరిమితి 18,600 పౌండ్ల నుంచి 29,000 పౌండ్లకు పెంపు
  • వచ్చే ఏడాది 38,700 పౌండ్లకు పెంచబోతున్నట్టు వెల్లడి
యూకేకి విదేశీ వలసలను తగ్గించాలనే ప్రణాళికల్లో భాగంగా ప్రధాని రిషి సునాక్ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ మెంబర్ వీసాను స్పాన్సర్ చేయడానికి అవసరమైన కనిష్ఠ ఆదాయ పరిమితిని ఏకంగా 55 శాతం మేర పెంచింది. ప్రస్తుత ఆదాయ పరిమితి 18,600 పౌండ్లుగా ఉండగా దానిని 29,000 పౌండ్‌లకు చేర్చుతూ గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ సవరణ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఇక వచ్చే ఏడాది ఈ పరిమితి 38,700 పౌండ్‌లకు చేరుతుందని, సంవత్సరం ఆరంభం నుంచే నూతన ఆదాయ పరిమితి ఆచరణలోకి వస్తుందని యూకే ప్రభుత్వం వివరించింది. 

ఇమ్మిగ్రేషన్ విధానంలో తీసుకురావాల్సిన ముఖ్యమైన సంస్కరణలను ప్రకటించిన వారాల వ్యవధిలోనే అమలు చేయాలనే ఉద్దేశంతో హోం సెక్రటరీ తన కమిటీతో భేటీ అయ్యారని, ఆదాయ పరిమితి పెంపు నిబంధనను తక్షణమే ఆచరణలోకి తీసుకురావాలని నిర్ణయించడంతో తాజా మార్పు చోటు చేసుకుందని ప్రకటనలో యూకే ప్రభుత్వం తెలిపింది. మే 2023లో స్టూడెంట్ వీసా విధానాన్ని కఠినతరంగా మార్చిన అనంతరం మరో మార్పు తీసుకొచ్చినట్టు పేర్కొంది. 

సామూహిక వలసల కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను నివారించడం యూకేకి చాలా ముఖ్యమని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి జేమ్స్ క్లీవర్లీ అని వ్యాఖ్యానించారు. వలసలతో పొంచివున్న ముప్పు స్థాయులను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. యూకే వచ్చేవారి సంఖ్యను తగ్గించడం కంటే సులభమైన పరిష్కారం గానీ, నిర్ణయం గానీ లేవని ఆయన అన్నారు. బ్రిటన్ కార్మికులు, వేతనాలకు రక్షణ కల్పించే విషయంలో బ్రిటన్ ప్రభుత్వం నిబద్ధతతో ఉందన్నారు. యూకేకి వలస వచ్చేవారు ప్రభుత్వ ప్రయోజనాలపై ఆధారపడకూడదని ఆయన చెప్పారు. దీంతో యూకేలో నివసించేవారు సొంత ఆదాయాన్ని సమృద్ధిగా చూపగలిగితేనే కుటుంబ సభ్యులకు వీసాను స్పాన్సర్ చేసే అవకాశం ఉంటుంది.


More Telugu News