కవితను నేడు కోర్టులో హాజరుపరచనున్న సీబీఐ.. సర్వత్ర ఉత్కంఠ!

  • తీహార్ జైల్లో ఉన్న కవితను నిన్న అరెస్ట్ చేసిన సీబీఐ
  • కవితను ప్రశ్నిస్తేనే పూర్తి వివరాలు తెలుస్తాయంటున్న సీబీఐ
  • లిక్కర్ స్కామ్ లో కవిత కీలకపాత్ర పాత్ర పోషించారంటూ సీబీఐ అభియోగాలు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తీహార్ జైల్లో ఉన్న కవితను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని... సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు. ఈ నెల 6న తీహార్ జైల్లో ఆమెను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. తనను సీబీఐ ప్రశ్నించడాన్ని కవిత కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరగక ముందే ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. సౌత్ గ్రూప్ కు, ఆప్ కు కవిత మధ్యవర్తిగా వ్యవహరించారని... రూ. 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగాలు మోపింది. 

మరోవైపు, కవితను సీబీఐ అరెస్ట్ చేసిన వెంటనే ఆమె తరపు లాయర్లు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. సీబీఐ స్పెషల్ కోర్టు ముందు అత్యవసరంగా అప్లికేషన్ ఫైల్ చేశారు. నోటీసులు ఇవ్వకుండానే కవితను అరెస్ట్ చేశారని కవిత తరపు లాయర్లు వాదనలు వినిపించారు. అయితే, రెగ్యులర్ కోర్టు ముందు అప్లికేషన్ ఫైల్ చేయాలని జడ్జి ఆదేశించారు. దీంతో, వారు రెగ్యులర్ కోర్టులో అప్లికేషన్ ఫైల్ చేశారు. 

ఇంకోవైపు, కవితను తన కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేసింది. ఆమెను లోతుగా ప్రశ్నిస్తేనే వివరాలు బయటకు వస్తాయని సీబీఐ తన పిటిషన్ లో పేర్కొంది. ఈ క్రమంలో ఈరోజు కోర్టులో కవితను సీబీఐ హాజరుపరచనుంది. ఈ క్రమంలో, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. లోక్ సభ ఎన్నికలకు ముందు చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు బీఆర్ఎస్ పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.


More Telugu News