మేమిద్దరం కలిసొచ్చామంటే సూపర్ డూపర్ హిట్: చంద్రబాబు

  • అమలాపురంలో ప్రజాగళం-వారాహి విజయభేరి సభ
  • అడ్డు వస్తే సైకిల్ తో తొక్కుకుంటూ పోతామన్న చంద్రబాబు
  • గ్లాసును పగులగొట్టాలని చూస్తే పదునెక్కుతుందని వ్యాఖ్య 
అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ వద్ద నిర్వహించిన ప్రజాగళం-వారాహి విజయభేరి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. ఇవాళ తాము ప్రజల కోసం వచ్చామని వెల్లడించారు. 

అనుభవం ఉన్న నేను... ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉన్న వ్యక్తి, పవర్ స్టార్, నిజమైన నాయకుడు, మీరు నచ్చిన నాయకుడు, మీరు మెచ్చిన నాయకుడు ఇద్దరం కలిసి వచ్చామంటే ఇక చూడండి... సూపర్ డూపర్ హిట్... ఎవరైనా మాకు అడ్డంగా నిలబడగలరా? అడ్డం రావాలనుకుంటే సైకిల్ తో తొక్కుకుంటూ పోతాం... పగులగొట్టాలనుకుంటే గ్లాసు పదునెక్కుతుంది... పదునెక్కిన గ్లాసు ఏం చేస్తుందో నాకు కూడా తెలియదు... మరోవైపు కమలంతో ప్రధాని నరేంద్ర మోదీ కూడా మనతో కలిసి వస్తున్నారు అంటూ చంద్రబాబు వివరించారు. 

ఎంతో అందమైన కోనసీమకు మాఫియా నేతలు వచ్చారని, మరో పులివెందుల చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడికొస్తే ఇద్దరు వ్యక్తులు గుర్తుకు వస్తారు. స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన జీఎంసీ బాలయోగి, ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పార్టీలో చేరి చనిపోయేవరకు జెండా మోసిన మెట్ల సత్యనారాయణ. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి తీరని నష్టం జరిగింది. ఒక అహంకారి... అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. దాంతో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయాం. ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే, ఎప్పటికీ బాగు చేసుకోలేం. 

2014లో పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా మమ్మల్ని ఆశీర్వదించాడు, సహకరించాడు. ఆ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేశాం. ఇప్పుడు యువతలోనూ, ఆడబిడ్డల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మళ్లీ మంచి రోజులు వస్తాయని మాకు మంగళ హారతులు ఇచ్చారు. మీ ఆశలు నెరవేర్చే బాధ్యత మాది. 

గతంలో మేం కూటమిలో ఉన్నప్పుడు విభజన చట్టంలో ఉన్న అన్నీ తీసుకొచ్చాం. 11 విద్యాసంస్థలు తీసుకువచ్చాం... ఎయిమ్స్ తీసుకువచ్చాం. కేంద్రం అనుమతితో, నిధులతో పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేశాం. పోలవరం పూర్తయి ఉంటే ఈ గోదావరి జిల్లాల్లో మూడు పంటలకు నీళ్లు వచ్చేవి. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన వ్యక్తి ఈ జగన్ మోహన్ రెడ్డి. నాడు వ్యవసాయంలో, ఆక్వాలో, పెట్టుబడుల్లో, ఉద్యోగ కల్పనలో, ఏపీ ఆరోగ్య సూచికలో, విద్యా ప్రమాణాల్లో, రోడ్ల నిర్వహణలో, పథకాల వినియోగంలో, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి అగ్రస్థానంలో ఉన్నాం.

ఇవాళ ఏ ఒక్కరైనా ఆనందంగా ఉన్నారా? తిండిలేక అప్పుల పాలై రైతులు అవస్థలు పడుతున్నారు, యువతకు ఉద్యోగాలు లేవు, యువతకు జాబ్ రావాలంటే కూటమి రావాలి. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చెప్పిన ఓ అంశాన్ని ప్రస్తావిస్తాను. "నా చిన్నప్పుడు మా అన్నయ్య చిరంజీవి నాకు నటనలో నైపుణ్యం నేర్పించాడు, సినిమా డైలాగులు ఎలా చెప్పాలో నేర్పించాడు... దాంతో నేను నటుడిగా ఎదిగి, ఇవాళ  రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజల ముందుకు వచ్చాను" అని పవన్ చెప్పాడు.

ఆనాడు చిరంజీవి గారు తీసుకున్న నిర్ణయంతో ఇవాళ కుటుంబం మొత్తం సినిమా యాక్టర్లు అయ్యారంటే సరైన సమయంలో స్కిల్ ఇవ్వడం వల్లే. అందుకే మేం యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తాం... మీకు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. మీ ఇంట్లో కూర్చుని ప్రపంచ కంపెనీల్లో పనిచేసే అవకాశం కల్పిస్తాం. హైదరాబాదులో ఉన్నట్టు  ఒక హైటెక్ టవర్ కూడా ఇక్కడ కోనసీమలో నిర్మిస్తాం. పవన్ కల్యాణ్ చెప్పినట్టు ఒక ట్రైన్ కొబ్బరిచెట్ల మధ్యలో పోతుంటే పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుంది. 

ఖబడ్దార్ చెబుతున్నా... అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. మాకు ఏ నిబంధనలు వర్తిస్తాయో, జగన్ కు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి. జగన్ ఏం చేయాలన్నా ఎన్నికల కమిషన్ నిఘా ఉంటుంది. ఇప్పుడాయన కూడా మా మాదిరే హామీలు ఇచ్చి, ఎన్నికలు అయ్యాకే పనులు చేయాల్సి ఉంటుంది... ఇప్పుడేం చేయడానికి లేదు. చిల్లర పనులు చేసే వాళ్లు చరిత్రలో కొట్టుకుపోతారు. 

ఎవరికీ అంత అహంకారం పనికిరాదు. చిరంజీవికి, జగన్ కు పోలిక ఉందా? చిరంజీవి చిత్రసీమలో రారాజుగా వెలిగినటువంటి వ్యక్తి. ఆయన కళామతల్లికి చేసిన సేవలకు గుర్తింపుగా పద్మవిభూషణ్ ఇచ్చారు. అలాగే బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో రాజమౌళి దిగ్గజ దర్శకుడిగా ఎదిగారు. ఆయనకు కూడా పద్మ అవార్డు ఇచ్చారు. అలాంటి మహామహులను, హీరోలను పిలిపించి తన ఇంటి వద్ద అవమానించిన విషయాన్ని అందరూ గ్రహించాలి. 

నేను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఏ నటుడ్ని కూడా అవమానించలేదు. నటులను గౌరవించే సంస్కారం మాది. పవన్ కల్యాణ్ సినిమాలు రిలీజైతే టికెట్లకు రేట్లు కూడా ఇవ్వని దుర్మార్గుడు ఈ జగన్ మోహన్ రెడ్డి. మనమందరం ఆయనకు బానిసలం అనుకుంటున్నాడు... మనం ఆయనకు ఊడిగం చేస్తే అప్పుడు టికెట్లకు రేట్లిస్తాడు... ఈయన అబ్బ సొత్తు అనుకుంటున్నాడు. 

సంస్కారం ఉండాలి కానీ కుసంస్కారం ఉండకూడదు. అందుకే సుమతీ శతకంలో అంటారు... శునకాన్ని తీసుకెళ్లి సింహాసనంపై కూర్చోబెడితే దాని బుద్ధి మారదు... ఈ రాష్ట్రంలో అదే జరిగింది" అంటూ చంద్రబాబు వివరించారు.


More Telugu News