కేసీఆర్ ఎప్పుడు జైలుకు పోతాడో తెలియదు: రఘునందన్ రావు

  • పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మునిగిపోవడం ఖాయమని వ్యాఖ్య
  • సూట్ కేసుల్లో పైసలు ఉన్న వెంకట్రామిరెడ్డికి టిక్కెట్ ఇచ్చారన్న రఘునందన్ రావు
  • సిద్దిపేటలో హరీశ్ రావుకు వచ్చిన మెజార్టీని క్రాస్ చేస్తామని ధీమా
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడు జైలుకు పోతాడో తెలియదని మెదక్ లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. గురువారం మెదక్ పట్టణంలోని చిల్డ్రన్ పార్కులో బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా మునిగిపోవడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ పడవ వంటిదన్నారు. మెదక్ పార్లమెంట్ నుంచి జై తెలంగాణ అన్నవాళ్లకు బీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వలేదని విమర్శించారు. మెదక్‌లో తెలంగాణవాదులు అభ్యర్థులుగా దొరకలేదా అని ప్రశ్నించారు.

ప్రజలు ఓటేసి గెలిపించరని భావించిన బీఆర్ఎస్... సూట్‌కేసుల్లో పైసలు ఉన్న వెంకట్రామిరెడ్డికి టిక్కెట్ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కాళ్లు మొక్కి ఒక్కరూపాయి ఖర్చు లేకుండా వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ అయ్యారన్నారు. వరి వేస్తే ఉరి అన్న వెంకట్రామిరెడ్డి మెదక్‌కు వచ్చి రైతుల ఓట్లు ఎలా అడుగుతాడు? అని ప్రశ్నించారు.

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ డబ్బులు పంచితే వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట నుంచి హరీశ్ రావును బీట్ చేసే స్థాయిలో ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తనకు ఒక్క ఓటు ఎక్కువొచ్చినా సిద్దిపేట నుంచి హరీశ్‌ను కరీంనగర్‌కు పంపిస్తానన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేయవచ్చునో ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్ చెప్పారని ఎద్దేవా చేశారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తికి కాంగ్రెస్ టికెట్ ఎలా ఇచ్చింది? అని నిలదీశారు. మెదక్‌లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఆదిలాబాద్‌లో భారీ మెజార్టీ

ఆదిలాబాద్ లోక్ సభ నుంచి బీజేపీ అభ్యర్థిని రెండు లక్షల మెజార్టీతో గెలిపిస్తామని సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోందన్నారు. తెలంగాణ నుంచి కనీసం 12 సీట్లు గెలుస్తామన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సగం సీట్లలో కూడా పోటీచేయడం లేదని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి గోల్ మాల్ చేసి ముఖ్యమంత్రి అయ్యారు: ఈటల రాజేందర్

రేవంత్ రెడ్డి గోల్ మాల్ చేసి ముఖ్యమంత్రి పదవి ఎగరేసుకుపోయారని ఈటల రాజేందర్ అన్నారు. దేశమంతా అబ్ కీ బార్ చార్ సౌ బార్ అని అంటోందన్నారు. రేవంత్, కేసీఆర్‌లాగా ప్రధాని మోదీ అమలుచేయలేని హామీలు ఇవ్వలేదన్నారు. పాలన చూసి ఓటేయాలని మోదీ గతంలోనూ చెప్పారని... అందుకే అప్పుడు 330 సీట్లు ఇచ్చారని పేర్కొన్నారు. ఎన్నో హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ హామీలపై వేటాడి వెంటపడుతామన్నారు. ప్రాజెక్ట్‌లలో నీళ్లు ఉన్నప్పటికీ పాలనలో సమన్వయం లేక పంటలు ఎండుతున్నాయన్నారు. మల్కాజ్‌గిరిలో డబ్బులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. మోదీ నాయకత్వంలో దేశం ప్రశాంతంగా ఉందన్నారు. మోదీకి రాహుల్‌గాంధీ సరితూగుతారా? అని ప్రశ్నించారు.


More Telugu News