వ్యూహంలో భాగంగా కాంగ్రెస్‌లోకి వెళ్లి పోటీ చేశా... అందుకే త్యాగానికి సిద్ధపడ్డా: మధ్యప్రదేశ్ బీజేపీ నేత

  • మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయిన రాంకిషోర్ శుక్లా
  • ఆ తర్వాత బీజేపీలో చేరిన రాంకిషోర్ శుక్లా
  • ఆరెస్సెస్ నేత తనను కాంగ్రెస్‌లోకి పంపించినట్లు వెల్లడి
  • బీజేపీ అభ్యర్థిని బలహీనంగా ఉండటంతో తాను కాంగ్రెస్ నుంచి పోటీ చేశానని వెల్లడి
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు రాంకిషోర్ శుక్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ వ్యూహంలో భాగంగానే ఆరెస్సెస్ తనను కాంగ్రెస్ పార్టీలోకి పంపించిందని... తాను మోవ్‌లో పోటీ చేసి ఓడిపోయానన్నారు. ఇదంతా ఎన్నికల వ్యూహంలో భాగమే అన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆరెస్సెస్ సీనియర్ నేత ఆదేశాల మేరకు అలా చేసినట్లు చెప్పారు.

కాగా, తాను అలా చేయడానికి బీజేపీ అభ్యర్థిని ఉషాఠాకూర్‌ బలహీన పరిస్థితి కారణమని వ్యాఖ్యానించారు. ఆమెకు పార్టీ నుంచే పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే అనంత్‌సింగ్‌ దర్బార్‌ స్వతంత్ర అభ్యర్థిగా అక్కడ పోటీ చేశారని గుర్తు చేశారు. ఈ రాజకీయ సమీకరణల వల్ల తాను త్యాగానికి సిద్ధమైనట్లు చెప్పారు. ఆరెస్సెస్ నేత, వీహెచ్‌పీకి చెందిన ఇండోర్‌ విభాగం నేత అభిషేక్ ఉదేనియా తనను కాంగ్రెస్‌లోకి పంపించినట్లు చెప్పారు.


More Telugu News