రేటెంత రెడ్డి రేట్ ఎవరు ఫిక్స్ చేస్తున్నారో తెలియదు.. కానీ రాష్ట్రమంతా సెటిల్మెంట్లు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

  • రేవంతూ, అంటే నా వంతు ఏంటి? అని అంటున్నాడని విమర్శ
  • రేటెంత రెడ్డి రేట్ ఎవరు ఫిక్స్ చేస్తున్నారో తెలియదని వ్యాఖ్య
  • పాలనను గాలికి వదిలేసి వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపాటు
రేటెంత రెడ్డి రేట్ ఎవరు ఫిక్స్ చేస్తున్నారో తెలియదు... కానీ ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో సెటిల్మెంట్లు జరుగుతున్నాయని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ... రేవంతూ, అంటే నా వంతు ఏంటి? అని అంటున్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి దగ్గరకి పోయినవాళ్లు నీ వంతుకు రేటెంత రెడ్డి అని అడుగుతున్నారన్నారు. రేటెంత రెడ్డి రేట్ ఎవరు ఫిక్స్ చేస్తున్నారో తెలియదన్నారు.

రాష్ట్రంలో ప్రతిచోట సెటిల్మెంట్లు జరుగుతున్నాయని ఆరోపించారు. పాలనను గాలికి వదిలేసి వసూళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు క్లియర్‌ చేయడానికి కొత్తగా 'బీ' ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్నారు. ఇప్పటికే తెలంగాణలో 'ఆర్' ట్యాక్స్ అమల్లో ఉందని... ఇప్పుడు ఓ మంత్రి 'బీ' ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

కాంట్రాక్టర్ల నుంచి బిల్లులో 8 నుంచి 9 శాతం కమీషన్‌గా తీసుకుంటున్నారన్నారు. ఈ విషయాన్ని కొందరు కాంట్రాక్టర్లు తమతో చెప్పారని వెల్లడించారు. 'బీ' ట్యాక్స్ అంటే భట్టి ట్యాక్స్‌ కాదని... ఏ ట్యాక్సో తనకు మాత్రం తెలియదన్నారు. కానీ ఈ ట్యాక్స్ మాత్రం కొత్తగా వచ్చిందన్నారు. మంత్రులపై ముఖ్యమంత్రికి ఎంత పట్టు ఉందో తనకు అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.


More Telugu News