మీరంతా కష్టపడితేనే అధికారంలోకి వస్తాం: పార్టీ శ్రేణులతో బొత్స సత్యనారాయణ

  • విజయనగరంలో వైసీపీ సర్వసభ్య సమావేశం
  • అందరూ కష్టపడితేనే మన గౌరవాన్ని నిలబెట్టుకుంటామన్న బొత్స
  • జగన్ మళ్లీ సీఎం కావడం 100 శాతం నిజమని ధీమా
బడుగు, బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి జగన్ నాయకత్వం అవసరమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మళ్లీ జగన్ గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. జగన్ ను గెలిపించేందుకు చిన్నచిన్న మనస్పర్థలు పక్కన పెట్టి పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతి ఒక్కరూ కష్టపడితేనే మన గౌరవాన్ని మళ్లీ నిలబెట్టుకుంటామని చెప్పారు. విజయనగరంలో ఈరోజు వైసీపీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బొత్స మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

పార్టీ కోసం కష్టపడే వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని, పదవులను వచ్చే ఐదేళ్లలో ఇస్తామని బొత్స హామీ ఇచ్చారు. మీరంతా కష్టపడితేనే అధికారంలోకి వస్తామని చెప్పారు. మన మీద వచ్చే వ్యతిరేక వార్తలను, ప్రచారాలను తిప్పికొట్టాలని... సోషల్ మీడియా ద్వారా మన ప్రచారాన్ని పెంచాలని అన్నారు. ఈరోజున మీడియా కంటే సోషల్ మీడియానే పవర్ ఫుల్ గా ఉందని చెప్పారు.

గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గిందని బొత్స తెలిపారు. వ్యవసాయ రంగం కూడా అభివృద్ధి బాటలో ఉందని చెప్పారు. చెప్పుకోవడానికి ఏమీ లేకే ప్రభుత్వంపై చంద్రబాబు బురద చల్లుతున్నారని విమర్శించారు. చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని చెప్పారు. మన పార్టీలో ఉన్న అసమ్మతి నేతలను పట్టించుకోవద్దని... అలాంటి నాయకులు వెళ్లిపోయినా మనకు వచ్చే నష్టం ఏమీ లేదని అన్నారు. జగన్ నాయకులను నమ్ముకోలేదని... ప్రజలను నమ్ముకున్నారని చెప్పారు. 

ఇదే సమయంలో పురందేశ్వరిపై బొత్స విమర్శలు గుప్పించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై పురందేశ్వరి ఈసీకి లేఖలు రాస్తున్నారని... హెరిటేజ్ సంస్థ మేనేజర్లను పెట్టి ఎన్నికలు నిర్వహించాలా? అని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా... జనాల్లో జగన్ కు ఉన్న అభిమానాన్ని చెరపలేరని అన్నారు. జగన్ మళ్లీ సీఎం అవుతారనేది 100 శాతం నిజమని చెప్పారు.


More Telugu News