ఐదేళ్ల క్రితం కమ్మపాలెంలో ఇలాంటి ఘటనలకే పాల్పడ్డారు: బాలినేని శ్రీనివాసరెడ్డి

  • ఒంగోలులో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ
  • తన కోడలిపై దుర్భాషలాడారన్న బాలినేని
  • ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని వ్యాఖ్య
ఒంగోలులో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ ఘటనలపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఘాటుగా స్పందించారు. తనను టచ్ చేస్తే ఊరుకున్నానని... తన కుటుంబ సభ్యులను టచ్ చేసినా ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన తన కోడలిపై టీడీపీ శ్రేణులు నానా దుర్భాషలాడాయని, దాడికి ప్రయత్నించాయని అన్నారు.

 ఒంగోలులో భయానక పరిస్థితులను సృష్టించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని టీడీపీ భావిస్తోందని ఆయన విమర్శించారు. ఐదేళ్ల క్రితం ఒంగోలు కమ్మపాలెంలో ఇదే తరహా ఘటనకు పాల్పడి అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ సామాజికవర్గానికి చెందిన ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదని అన్నారు.  

టీడీపీ వాళ్ల దాడిలో గాయపడి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ కార్యకర్తల దగ్గరకు కూడా వెళ్లి టీడీపీ నేతలు బెదిరించారని బాలినేని మండిపడ్డారు. తమ కార్యకర్తలను ఆసుపత్రిలో బెదిరించిన వీడియోలు కూడా తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలతో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన కుటుంబంపై ఇలాంటి ఘటనలకు పాల్పడటం కరెక్టేనా? అనే ప్రశ్నకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 



More Telugu News