ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శిపై వేటు

  • 2007లో ప్రభుత్వ ఉద్యోగిపై దాడి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో కేసు నమోదు
  • విధుల నుంచి తొలగిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వుల జారీ
  • కేజ్రీవాల్‌కు పీఎస్‌గా నియమించే సమయంలో కేసు వివరాలను వెల్లడించలేదని దర్యాఫ్తులో వెల్లడి
మద్యం కేసుకు సంబంధించి మనీలాండరింగ్ అంశంలో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి వైభవ్ కుమార్‌పై వేటు పడింది. 2007లో ప్రభుత్వ ఉద్యోగిపై దాడి, విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదయింది. నోయిడాకు చెందిన మహేశ్ పాల్ అనే వ్యక్తి ఈ కేసును దాఖలు చేశారు. వైభవ్ కుమార్‌.. మరో ముగ్గురితో కలిసి ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేశాడని కేసు నమోదయింది.

ఈ నేపథ్యంలో డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ఆయనను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తొలగింపు తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అతనిపై నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేజ్రీవాల్‌కు పీఎస్‌గా నియమించే సమయంలో ఈ కేసు వివరాలను వెల్లడించలేదని విజిలెన్స్ విభాగం దర్యాఫ్తులో వెల్లడైంది. దీంతో ఆయనను తక్షణమే విధుల నుంచి తొలగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.


More Telugu News